Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్‌లో వ్యూహం మార్చిన కమలదళం

జూబ్లీహిల్స్‌లో వ్యూహం మార్చిన కమలదళం

T Venkata Ramana
6 అక్టోబర్, 2025

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం సాధించాలని చూస్తున్న బీజేపీ ఈ బై-పోల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైకి బీజేపీ సైలెంట్‌గా ఉందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, లోలోపల కమలదళం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ గెలుపే లక్ష్యంగా 'సైలెంట్ క్యాంపెయినింగ్'కు పదును పెడుతోంది.

రహస్య భేటీలు, ప్రత్యేక కమిటీలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ జూబ్లీహిల్స్ బై-పోల్‌ను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ఆయన మానిటరింగ్ కమిటీతో కీలక సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో ప్రచార వ్యూహాలు, బూత్ స్థాయి కార్యకలాపాల పురోగతి అభ్యర్థి ఎంపికపై సమగ్రంగా చర్చించారు.

మానిటరింగ్ కమిటీ

బీజేపీ అధిష్టానం ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రారెడ్డి, గౌతం రావులతో కూడిన ఒక బలమైన మానిటరింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తోంది.

సైలెంట్ ఆపరేషన్

బీజేపీ శ్రేణులు హడావిడి లేకుండా, 'చాప కింద నీరు' లాగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసుకుని, ప్రతి కాలనీలో బూత్ మీటింగ్స్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ చీఫ్ రాంచందర్ రావు సూచించారు. జూబ్లీహిల్స్ ఓటర్ల 'నాడి'ని పట్టుకుని, దానికి తగ్గట్లుగా ప్రణాళికలు రచించుకుంటున్నారు.

టికెట్ రేసులో

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ తరఫున అభ్యర్థి ఎవరన్నదానిపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. టికెట్ కోసం పలువురు రాష్ట్ర నాయకత్వాన్ని ఆశ్రయించారు. లంకల దీపక్ రెడ్డి హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పార్టీతో బలమైన అనుబంధం ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గం మద్దతు తనకు ఉంటుందని, టికెట్ తనకే దక్కుతుందని ఆయన గట్టి ధీమాతో ఉన్నారు. స్థానికంగా బలం, ఆర్థిక అండదండలు ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది.

మహిళా నేతలు

ఇక కీర్తి రెడ్డి గతంలోనూ జూబ్లీహిల్స్ టికెట్‌ను ఆశించారు. కిషన్ రెడ్డి అనుచర వర్గంగా పేరుంది. పార్టీలో సీనియర్ నాయకురాలు. మహిళా కోటాలో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం, మహిళా కేటగిరీ కలిసి వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ముందు తన మనసులోని మాటను కీర్తిరెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. ఆకుల విజయ బీసీ మహిళా నేత. గతంలో మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేశారు. పార్టీతో మంచి అనుబంధం ఉంది. రాష్ట్రంలో బీసీ రాజకీయం నడుస్తున్న వేళ బీసీలకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అధికార కాంగ్రెస్ కూడా బీసీని బరిలోకి దించాలని చూస్తున్నందున, బీజేపీ నుంచి బీసీ అభ్యర్థిగా తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు రాష్ట్ర నేతల మద్దతు కూడా ఆమెకు ఉంది. వీరపనేని పద్మ బీజేపీ మహిళా నేత. పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్నారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తానని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నారు.తాజాగా సినీ నటి జయసుధ పేరుకూడా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ నుంచి జయసుధకు టికెట్ ఇస్తారని, ఇటీవలే ఆమె బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును కలిశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు కూడా అనేక కామెంట్లు పెడుతున్నారు. జయసుధకు టికెట్ ఇస్తే బీజేపీ పోటీ చేయడం కూడా వేస్టే నని కొందరు, అన్యమతస్థురాలికి బీజేపీ టికెట్ ఎలా ఇస్తుందంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మొత్తం మీద జూబ్లీహిల్స్‌లో గెలుపు గుర్రం కోసం కమలదళం వ్యూహ రచనలో నిమగ్నమై ఉంది. ఒకవైపు పార్టీ శ్రేణులను ఎన్నికల కోసం సిద్ధం చేస్తూ మరోవైపు బలంగా ఉన్న అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది. బీజేపీ ఎంచుకోబోయే వ్యూహం, అభ్యర్థి ఎంపిక ఈ బై-పోల్ ఫలితాన్ని గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఓటరు నాడిని పట్టుకుని గెలుపు గుర్రంగా ఎవరిని బరిలోకి దించుతారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

జూబ్లీహిల్స్‌లో వ్యూహం మార్చిన కమలదళం - Tholi Paluku