Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే..

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే..

Aravind Maryada Reddy
13 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకుంటూ తమకు ఈ నియోజకవర్గంలో బలముందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది. మరి నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఈ చేరికలతో ఎంతమేర దూకుడు ప్రదర్శించగలదు. ఆ పార్టీకి నియోజకవర్గంలో ఉన్న బలమెంత? అన్నది వేచి చూడాలి. అయితే ఒకవేళ ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోతే పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్టు రాష్ట్రంలోని అన్ని నియోజవకర్గాలకు పాకి పోయే అవకాశం ఉంది. క్రమంగా ఈ అంశం బీఆర్ఎస్ పార్టీ బలపడేందుకు ఉపయోగ పడే అవకాశం ఉంది. గతంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో కొన్ని ఎమ్మెల్సీలను గెలుచుకున్నది. అనంతరం టీడీపీ గెలుపుకు ఈ పరిణామం బాటలు వేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ గనక కాంగ్రెస్ ఓడిపోతే సీఎం రేవంత్ రెడ్డి బలహీనమయ్యే అవకాశం ఉంది. కొందరు మంత్రులు, రేవంత్ వ్యతిరేకులు ఇందుకోసం కాచుకొని చూస్తున్నట్టు విశ్లేషణలు ఉన్నాయి. మరి జూబ్లీహిల్స్ గెలుపు కోసం సదరు నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తారా? అన్నది అనుమానమే. ఇలా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నిక అనేక రాజకీయ పరిణామాలకు వేదిక కాబోతున్నది.

బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) సమక్షంలో బీజేపీ నాయకులు కొందరు తాజాగా బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రజలు 'కారు'ను లేక 'బుల్డోజర్'ను ఎంచుకోవాలని, కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

హైడ్రా లక్ష్యంగా ఆరోపణలు

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లమీదకు వస్తాయని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. అయితే నిజానికి హైడ్రా వల్ల హైదరాబాద్ నగరంలో చెరువులు రక్షిస్తున్నామని.. ప్రజల మేలు కోసం భవిష్యత్‌లో ప్రజలకు కష్టాలు ఉండకూడదని తాము హైడ్రాతో చెరువులను రక్షించి ముంపు ప్రాంతాలు నీట మునగకుండా కాపాడుతున్నామని కాంగ్రెస్ చెబుతోంది. అయితే బీఆర్ఎస్ మీద దీని మీద మరో విధంగా ప్రచారం చేస్తోంది. హైడ్రా బుల్డోజర్లు పేదల ఇండ్లను కూలుస్తాయన్నది ఆ పార్టీ ఆరోపణ. మరి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో వేచి చూడాలి.

జూబ్లీహిల్స్ ప్రాముఖ్యత ఇదే..

జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ నగరంలోని అత్యంత ప్రముఖ ప్రాంతాల్లో ఒకటి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలుపొందారు. ఆయన మరణంతో ఖాళీ అయిన ఈ సీట్‌పై ఇప్పుడు దివంగత ఎమ్మెల్యే మాగంటి భార్య సునీతను రంగంలోకి దించారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపికయ్యారు. బీసీ మంత్రం, బస్తీ వాసుల ఓట్లు, మైనార్టీల ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతున్నది.

22 నెలల పాలనకు పరీక్ష

కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనకు ఈ ఎన్నిక పరీక్షగా మారే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే తమ పాలన ప్రజామోదంగానే ఉందని కాంగ్రెస్ చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ మీద తీవ్ర వ్యతిరేకత ఉందని.. కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత నిజమేనని ఆ పార్టీ చెప్పుకుంటుంది. తద్వారా భవిష్యత్ ఎన్నికలకు దారులు ఏర్పాటు చేసుకుంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం.. ఎంఐఎం మద్దతు ఆ పార్టీకి సానుకూల అంశాలు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఏకైక బలం సానుభూతి. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత.

కాంగ్రెస్ మోసాలకు గుణపాఠం

తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలు 'కారు' కావాలా లేక 'బుల్డోజర్' కావాలా నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉండి, ఎన్ని హామీలు ఇచ్చినా ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. "ఎన్నికల్లో బుద్ధి చెబితేనే కాంగ్రెస్ పార్టీకి సోయి వస్తది" అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీలు చెప్పి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, రెండు లక్షల 80 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పెట్టలేదని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.

అవినీతి సొమ్ము ఖర్చు పెడతారు

"రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌లో ఖర్చుపెడతారు. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ. 10,000 ఇస్తారు" అని ఆరోపించారు. బీజేపీని "తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ"గా, కాంగ్రెస్-బీజేపీలకు ఓటు వేస్తే "మోరీలో వేసినట్లే" అని పోల్చారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిపడాలంటే కేసీఆర్ తిరిగి రావాలి, అది జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. "ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే నెలకు 4 వేల పెన్షన్లు వస్తాయి, హామీలు అమలవుతాయి" అని, ఓటు వేస్తే మోసం చేసినా 'ఎవరూ ఏమీ చేయలేరు' అని కాంగ్రెస్ భావిస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు కేసీఆర్ నామ జపం చేసి కాలం గడిపారని, ఒక్క మంచి పని కూడా చేయలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

డబ్బు ఏరులై పారుతుందా?

ఈ నియోజకవర్గాన్ని రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ డబ్బు, మద్ంయ ఏరులై పారే అవకాశం ఉంది. ముఖ్యంగా బస్తీ వాసుల ఓట్లు ఎంతో కీలకం. వారి కోసం రెండు పార్టీలు భారీగానే ఖర్చు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే డబ్బు ఖర్చుపెడుతుందని ఆరోపిస్తున్నా.. బీఆర్ఎస్ కూడా భారీగానే డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. బస్తీ వాసులను ప్రలోభాలకు గురిచేయడం, తద్వారా ఓటర్లను ఆకర్షించడం చేయొచ్చు. మరి జూబ్లీహిల్స్ ఓటరు మదిలో ఏముందో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.

రేవంత్‌కు అగ్నిపరీక్ష

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షే అని చెప్పవచ్చు. కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డి పనితీరును అంచనా వేసేందుకే ఈ ఎన్నికలే ఆధారం. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సీనియర్లు రేవంత్ రెడ్డికి సహకరిస్తారా? అన్న చర్చ కూడా ఉంది. ఒకవేళ ఈ ఎన్నికలో ఓడిపోతే ముఖ్యమంత్రిని మార్చే అవకాశం కూడా ఉంటుందన్న విశ్లేషణ ఉంది. ఆ అవకాశమే ఉంటే మంత్రులు ఆయనకు సహకరిస్తారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకమే. అందుకే రేవంత్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలిస్తే.. - Tholi Paluku