
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓట్ చోరీ: పాడి కౌశిక్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ మరోసారి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, యూసుఫ్‌గూడాలోని బూత్ నంబర్ 246లో ఒకే ఇంట్లో ఏకంగా 43 అక్రమ ఓట్లు నమోదు చేయించినట్లు తమ దర్యాప్తులో బయటపడిందని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈ కొత్త ఓటు చోరీ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరుగుతోందంటూ కేంద్రాన్ని విమర్శిస్తుంటే, తెలంగాణలో ఆయన సొంత పార్టీ నాయకులే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. “తెలంగాణలో ఓట్ల చోరీ జరిగితే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇక్కడ జరిగింది ఓట్ల చోరీ కాదా” అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ నియోజకవర్గంలో ప్రజలకు దొంగ ఓట్లు పంచారని అన్నారు. “మీరు పంచిన దొంగ ఓట్లు ఇవేనా” అని ప్రశ్నించారు.
నకిలీ ఓటర్లను సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకే చిరునామాపై డజన్ల కొద్దీ ఓట్లు ఎలా నమోదయ్యాయో ఎన్నికల సంఘం తక్షణమే పరిశోధన జరపాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఓట్లు చోరీ చేస్తుందన్నారు. ఆ పార్టీ ఎన్ని దారుణాలు చేసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నకిలీ ఓట్ల అంశం ప్రధాన రాజకీయ చర్చనీయాంశంగా మారిందని, దీనిపై ఎన్నికల సంఘం వెంటనే విచారణ జరపాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
