Let's talk: editor@tmv.in
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలి: హరీష్ రావు

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలి: హరీష్ రావు

Shaik Mohammad Shaffee
25 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, తద్వారా నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని రాహుల్ గాంధీకి అర్థమయ్యేలా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 'నిరుద్యోగ బాకీ కార్డు' ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర విమర్శలు

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయినందుకు 'బాకీ కార్డులు' రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాయని హరీష్ రావు ధ్వజమెత్తారు. "సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే పోలీసులు లేకుండా ఒక్కసారి అశోక్‌నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి రావాలి" అని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో అశోక్‌నగర్, సరూర్ నగర్ స్టేడియాల్లో మీటింగ్‌లు పెట్టి, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని మాయ మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఆయన మండిపడ్డారు.

'జాబ్ లెస్ క్యాలెండర్' అంటూ ఎద్దేవా*

ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది 'జాబ్ క్యాలెండర్' కాదు, 'జాబ్ లెస్ క్యాలెండర్' అని ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, రాజీవ్ యువ వికాసం వంటి హామీలు అన్నీ బోగస్ అయ్యాయని ఆరోపించారు. జూన్ 2న 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తామన్న మాటలు కూడా నీటి మీద రాతలేనని మండిపడ్డారు.

కలెక్షన్ల మంత్రిగా పాస్, ముఖ్యమంత్రిగా ఫెయిల్*

సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. అయితే కలెక్షన్ల మంత్రిగా మాత్రం పాస్ అయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవో 29, జీవో 55లపై తాను అసెంబ్లీలో మాట్లాడినా భట్టి విక్రమార్క పట్టించుకోలేదన్నారు. "జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారు" అని దుయ్యబట్టారు. విద్య రాని వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా, అతి ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని హోం మంత్రిగా నియమించారని విమర్శించారు.

ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్సే*

బీఆర్ఎస్ ప్రభుత్వం 1.64 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిందని, 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని, కానీ, వాటిలో ఎస్సై, కానిస్టేబుల్, గురుకుల, గ్రూప్ 4, హెల్త్, జేఎల్, డీఎస్సీ వంటి 55 వేలకు పైగా నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్సేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది కేవలం 5 వేల ఉద్యోగాలు మాత్రమేనని పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్‌లో ఓడించాలని పిలుపు*

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి, రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించేందుకు నిరుద్యోగ యువతే 'దండు కట్టాలి' అని హరీష్ రావు పిలుపునిచ్చారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 'బాకీ కార్డులు' పెట్టి యువతను ఏకం చేసి ప్రత్యక్ష పోరాటం చేస్తామని హరీష్ రావు హెచ్చరించారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించాలి: హరీష్ రావు - Tholi Paluku