Let's talk: editor@tmv.in
జూన్ 26, 2027 నుంచి గోదావరి పుష్కరాలు

జూన్ 26, 2027 నుంచి గోదావరి పుష్కరాలు

Panthagani Anusha
14 డిసెంబర్, 2025

దక్షిణ భారత్‌ కుంభమేళా పేరుతో ప్రసిద్ధిగాంచిన గోదావరి పుష్కరాలు ఈసారి 2027 జూన్ 26 నుంచి ప్రారంభమై జూలై 7 వరకు మొత్తం 12 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రెవెన్యూ (ఎండోమెంట్–II) విభాగం మాజీ కార్యదర్శి ఎం. హరీ జవహర్‌లాల్ తెలిపిన వివరాల ప్రకారం, పుష్కరాల తేదీల ఖరారుకు ప్రభుత్వం వివిధ అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

టీటీడీ ఆస్థాన సిద్ధాంతి సూచనలతో తేదీల ఖరారు

పుష్కరాల ఖగోళ గణనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ఆస్థాన సిద్ధాంతి టి. వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ నుంచి సూచనలు కోరింది. ఆయన అందించిన పంచాంగ, ఖగోళ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

పుష్కరాల ప్రాముఖ్యత

గోదావరి పుష్కరాలు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి.

భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గోదావరి తీరం చేరి పవిత్ర స్నానాలు చేస్తారు. స్నానం ద్వారా పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం. ఈ కారణంగా ఇది కుంభమేళా తరహాలో భక్తులతో కిటకిటలాడుతుంది.

ప్రభుత్వం భారీ ఏర్పాట్లకు సన్నాహాలు

తేదీల ఖరారుతో ఎండోవ్మెంట్స్, మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్, పోలీసు శాఖలు ముందస్తు ఏర్పాట్లను ప్రారంభించాయి. ఇందుకు సంబంధించి ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు వేగవంతం చేస్తుండగా, తాగునీరు, పరిశుభ్రత, శౌచాలయాల వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రత్యేక బస్సులను నడిపే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో భద్రతా చర్యలు, జనసందోహ నియంత్రణ, తాత్కాలిక వసతులు, క్యూ లైన్ వ్యవస్థలు వంటి అంశాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, డౌలేశ్వరం, ధర్మపురి, భద్రాచలం ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.

అధికారిక నోటిఫికేషన్ జారీ

పుష్కరాల నిర్వహణ కోసం శాఖలన్నీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. త్వరలో అంతర శాఖ సమన్వయ కమిటీలు ఏర్పడే అవకాశం ఉంది.

జూన్ 26, 2027 నుంచి గోదావరి పుష్కరాలు - Tholi Paluku