
జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స విజయవంతం
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజం గాయానికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఆర్థ్రోస్కోపిక్ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు బుధవారం కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం అధికారికంగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్‌కు భుజానికి గాయం కాగా, వైద్య నిపుణుల బృందం సలహా మేరకు త్వరగా, సంపూర్ణంగా కోలుకోవడానికి ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. కిమ్స్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సురాపనేనిలతో కూడిన వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
3 నెలల్లో పూర్తిగా కోలుకునే అవకాశం
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం కుదుటపడిందని, వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక రిహాబిలిటేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని కిమ్స్ ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు బులెటిన్‌లో తెలిపారు. మరో 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఆయన పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు ధీమా వ్యక్తం చేశారు. కాగా, వైద్యుల సూచనల మేరకు ఎన్టీఆర్ 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీమ్ అభిమానులకు స్పష్టతనిస్తూ.. "ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎన్టీఆర్ ఆరోగ్యం స్థిరంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఊహాగానాలను, అసత్య ప్రచారాలను నమ్మవద్దు" అని కోరింది. అభిమానులు చూపిస్తున్న ప్రేమానురాగాలకు ధన్యవాదాలు తెలిపింది.
ఇక సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ తదుపరి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రంలో నటించనున్నారు. జూన్‌లో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. పురాణ నేపథ్యంతో రూపొందనున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్, భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్‌తో పాటు విస్తృతమైన వరల్డ్ బిల్డింగ్ ఉండనున్నట్లు మేకర్స్ తెలిపారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
