
జూదం, కోడిపందాల వంటి చెడు అలవాట్లు భోగిమంటల్లో దహనం కావాలి: డిప్యూటీ సీఎం
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన సంక్రాంతి వేడుకలను ఆచార బద్ధంగా జరుపుకోవాలని జూదం, కోడిపందాల వంటి చెడు అలవాట్లను భోగిమంటల్లో దహనం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పిఠాపురంలోని ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలను ఆయన వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి అనేది కేవలం ఒక మతానికి సంబంధించినది కాదని ప్రకృతిని ఆరాధించే సనాతన ధర్మ మూలాల నుంచి వచ్చిన పండుగ అని పేర్కొన్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కోడిపందాల్లో కోట్లు చేతులు మారే సంస్కృతికి స్వస్తి పలకాలని ఆకాంక్షించారు.
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై తన అంకితభావాన్ని చాటుకుంటూ పవన్ కళ్యాణ్ సుమారు రూ. 186 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ. 26 కోట్ల నిధులతో పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. గత 18 నెలల్లో దాదాపు రూ. 308 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ ఏడాది మరో రూ. 211 కోట్లతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ముఖ్యంగా గొల్లప్రోలులో వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిర్మించిన బ్రిడ్జిలు, 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, ఆధునీకరించిన పశువుల సంత వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. పిఠాపురాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఇక్కడ రోడ్డు సౌకర్యం లేని గ్రామం కానీ గుంతలున్న రహదారులు కానీ ఉండకూడదని స్పష్టం చేశారు.
ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ విపక్ష వైసీపీ తీరుపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. పిఠాపురంలో చిన్న సంఘటన జరిగినా సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయ్‌ని చంపినా అది వార్త కాదు కానీ ఇక్కడ చిన్న పిల్లలు కొట్టుకున్నా దానిని పెద్దది చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే వారిని ఉపేక్షించబోనని హెచ్చరించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు ఎటువంటి అరమరికలు లేవని కూటమి నాయకులు ఎవరూ పొత్తులను బలహీనపరిచేలా మాట్లాడవద్దని హితవు పలికారు.
చివరగా పిఠాపురం నియోజకవర్గ యువత కోసం దేశంలోనే అత్యున్నత మైన 'యుద్ధ విద్యల అకాడమీ'ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళగిరి పార్టీ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ హెడ్ క్వార్టర్ అయితే జనసేన పార్టీకి పిఠాపురమే ఐడియాలాజికల్ హెడ్ క్వార్టర్ అని ఆయన అభివర్ణించారు. ఇకపై ప్రతి ఏటా జనసేన ఆవిర్భావ వేడుకలను పిఠాపురంలోనే ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
