Let's talk: editor@tmv.in
జులైలో జింబాబ్వే టూర్‌కు టీమిండియా

జులైలో జింబాబ్వే టూర్‌కు టీమిండియా

Shaik Mohammad Shaffee
2 ఏప్రిల్, 2026

భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీమిండియా మరో పర్యటనకు సిద్ధమైంది. జులై నెలలో భారత సీనియర్ పురుషుల జట్టు జింబాబ్వేలో పర్యటించనుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్‌లూ హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్నాయి. జులై 23న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు చివరిసారిగా 2024లో జింబాబ్వేలో పర్యటించి ఐదు టీ20ల సిరీస్ ఆడింది.

2027లో జింబాబ్వే భారత్ రాక

ఈ పర్యటనతో పాటు మరో కీలక ప్రకటనను బీసీసీఐ వెలువరించింది. 2027 జనవరిలో జింబాబ్వే జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లకు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ వన్డే సిరీస్ తేదీలను బీసీసీఐ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జింబాబ్వే జట్టు ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోసం భారత్‌కు రానుండటం గమనార్హం. ఇది జింబాబ్వే క్రికెట్‌కు ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆ దేశ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ గివ్‌మోర్ మాకోని హర్షం వ్యక్తం చేశారు.

ప్రపంచ ఛాంపియన్‌తో పోరు

ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత్, జింబాబ్వే జట్లు సూపర్-8 దశలో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 256/4 భారీ స్కోరు సాధించి, 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రపంచ ఛాంపియన్‌తో తలపడటం తమ ఆటగాళ్లకు మంచి అవకాశమని మాకోని పేర్కొన్నారు. "భారత్‌తో మ్యాచ్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. మా దేశంలోనే ప్రపంచ ఛాంపియన్‌తో తలపడటం మా ఆటగాళ్లకు గొప్ప పరీక్ష. ప్రపంచకప్‌లో మా ప్రదర్శన ఆశాజనకంగా ఉంది, ఈ సిరీస్ ద్వారా ఆ వేగాన్ని కొనసాగిస్తాం" అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

టీమిండియా జింబాబ్వే పర్యటన షెడ్యూల్

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జులై 23 (గురువారం) మొదటి మ్యాచ్‌, జులై 25 (శనివారం) రెండో మ్యాచ్‌, జులై 26 (ఆదివారం) మూడో మ్యాచ్‌ జరుగుతాయి. ఈ మూడు మ్యాచ్‌లకు కూడా జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానమే వేదిక కానుంది.