
జుబీన్‌కు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలం: సైకియా
అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పలు అంశాల్లో ప్రజలను ‘ద్రోహం’ చేసిందని, ముఖ్యంగా ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ కేసులో న్యాయం చేయడంలో విఫలమైందని ప్రతిపక్ష నేత దేబ్‌బ్రత సైకియా ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షాలు మెరుగైన ఫలితాలు సాధిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైకియా మాట్లాడుతూ బీజేపీ చేసిన ద్రోహాల జాబితా పెద్దదే అయినప్పటికీ, జుబీన్ గార్గ్ కేసులో న్యాయం జరగకపోవడం చివరి పెద్ద ద్రోహమని అన్నారు. ఈ కేసుపై ప్రజా పర్యవేక్షణ ఉండాలని తాము పదేపదే కోరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కేసు విచారణను పర్యవేక్షించేందుకు ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించినా అది అమలు కాలేదని తెలిపారు. గత సంవత్సరం సెప్టెంబర్ 19న సింగపూర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి వెళ్లిన జుబీన్ గార్గ్ మునిగి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరగలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
అదేవిధంగా, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలులో కూడా బీజేపీ ప్రజల ఆకాంక్షలను విస్మరించిందని సైకియా విమర్శించారు. అస్సాం ఒప్పందంలో నిర్దేశించిన 1971 మార్చి 25 కట్‌ఆఫ్ తేదీకి విరుద్ధంగా సీఏఏ ద్వారా కొందరికే పౌరసత్వం ఇచ్చి తదితర ప్రజలకు అన్యాయం చేసిందని అన్నారు.
వారు చేరడం వల్ల పార్టీపై ప్రభావం ఉండదు
టీ తోటల కార్మికుల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు కేవలం రూ.30 వేతన పెంపు ప్రకటించడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ప్రభుత్వం అనుకుంటే ఏ నిర్ణయం అయినా తీసుకోగలదని ఇది స్పష్టం చేస్తుందని అన్నారు. అస్సాంలోని ఆరు వర్గాలకు షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా ఇవ్వడంలో, వరద సమస్యను నియంత్రించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి పలువురు సీనియర్ నాయకులు బీజేపీలో చేరినప్పటికీ పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా పై అస్సాంలో ఈ మార్పులు ప్రభావం చూపవని తెలిపారు. బీజేపీలో చేరబోతున్నారన్న ఆరోపణలను ఖండిస్తూ, తన కుటుంబం ఎప్పటినుంచో కాంగ్రెస్‌తోనే ఉందని, తాను కూడా పార్టీని వదిలే ప్రశ్నే లేదని అన్నారు. సీబీఐ, ఆదాయపు పన్ను దర్యాప్తులను ఎదుర్కొన్నానని, బీజేపీలో చేరాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
కూటమి ముందుగానే ఏర్పడాల్సింది
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ ఆయన భార్యపై ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం దురదృష్టకరమని విమర్శించారు. ఆరు పార్టీల ప్రతిపక్ష కూటమి ఏర్పాటును స్వాగతించినప్పటికీ, అది ముందుగానే జరిగి ఉంటే ఇంకా బలంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ కూడా పూర్తిగా కూటమిలో చేరి ఉండాల్సిందని సూచించారు. నజీరా నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని, బీజేపీ అభ్యర్థి మయూర్ బోర్గొహైన్, సీపీఐ అభ్యర్థి కనక్ గోగోయ్‌లతో పోటీ తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. తాను గెలుస్తానన్న నమ్మకం ఉన్నప్పటికీ, మెజారిటీపై స్పష్టత లేదన్నారు. 126 స్థానాల అస్సాం అసెంబ్లీకి ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న జరుగనుంది.
