
జుబిన్ గార్గ్‌లా ప్రజలను ఏకం చేస్తాం: రాహుల్ గాంధీ
రాష్ట్ర ప్రజలను ఏకం చేయడమే కాంగ్రెస్ పార్టీ తత్వమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ప్రసిద్ధ గాయకుడు జుబీన్‌గార్గ్ జీవితాంతం అస్సాం ప్రజలను కలిపి ఉంచేందుకు కృషి చేశారని, అదే తత్వాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తుందని అన్నారు. అస్సాంలోని బిస్వనాథ్ చారియాలి, గోలాఘాట్ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి ప్రధానమంత్రి అని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జుబిన్ గార్గ్ ఎప్పుడూ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచకుండా ప్రేమ, ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తోందని విమర్శించారు.
అవినీతి ఆరోపణలు
హిమంత బిశ్వ శర్మ మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులపై ఉన్న అవినీతి ఆరోపణలను కూడా విచారిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. అస్సాంలో భూములను స్వాధీనం చేసుకుని కొంతమంది పెద్ద పారిశ్రామిక వేత్తలకు అప్పగించేందుకు ల్యాండ్ ఏటీఎం విధానాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, సీఎం శర్మ కలిసి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అస్సాంలో మూడు పెద్ద కార్పొరేట్ సంస్థలకు కలిపి సుమారు 98,400 బీఘాల భూమి ఇచ్చినట్లు ఆరోపించారు.
అమెరికా ఒప్పందంపై విమర్శ
భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం దేశానికి నష్టదాయకమని అన్నారు. అమెరికా వస్తువులపై పన్నులు తగ్గించి భారత మార్కెట్‌ను తెరిచారని, దీంతో దేశంలోని చిన్న వ్యాపారులు, పరిశ్రమలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, మోడీ మధ్య సంబంధాలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.
విభజన రాజకీయాలకు ప్రజలు చెక్ పెడతారు: కన్హయ్య కుమార్
ఇదే సందర్భంగా కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ బొంగాయిగావ్‌లో జరిగిన సభలో మాట్లాడారు. విభజన, బెదిరింపుల రాజకీయాలకు అస్సాం ప్రజలు ఈ ఎన్నికల్లో ముగింపు పలుకుతారని అన్నారు. బీజేపీ మిత్రపక్షం అయిన అసోం గణపరిషత్ గత 40 సంవత్సరాలుగా బొంగాయిగావ్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నదని, ఈసారి మార్పు కోసం ఓటేయాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో రైతులకు సరైన ధరలు లభించడం లేదని, కొత్త పరిశ్రమలు స్థాపించలేదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయని ఆయన ఆరోపించారు. బోహాగ్ బిహూ పండుగ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జుబిన్ గార్గ్‌ను ప్రజలు మరింతగా గుర్తుచేసుకుంటున్నారని, అయితే ఆయనకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కన్హయ్య కుమార్ అన్నారు.
