
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయాలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్టాండింగ్ కమిటీ 6వ సాధారణ సమావేశం జూలై 25, 2026న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఐఏఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
నగరవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, పట్టణ పాలన, పారిశుధ్యం, డిజిటల్ సాంకేతికతను బలోపేతం చేసే పలు కీలక ప్రతిపాదనలకు ఈ సమావేశంలో కమిటీ ఆమోదం తెలిపింది. గౌలీపురా చిన్న జంతువుల వధశాల ఆధునీకరణ, సంజీవయ్య పార్క్ ఆర్‌ఓబీ, రసూల్‌పురా ద్విముఖ ఫ్లైఓవర్ నిర్మాణం, హైడర్‌షాకోట్‌లో సీసీ రోడ్లు, బడంగ్‌పేట్‌లో బీటీ రోడ్ల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు. అలాగే కిస్మత్‌పూర్, బండ్లగూడ జాగీర్, శంషాబాద్ ప్రాంతాల్లో మిస్సింగ్ లింక్ రోడ్ల విస్తరణకు భూసేకరణతో కూడిన రహదారి ప్రతిపాదనలపై కూడా కమిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది.
స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద స్వచ్ఛత నాలెడ్జ్ పార్ట్‌నర్ నియామకం, పాఠశాలల్లో ఐటీసీ భాగస్వామ్యంతో "వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్" కార్యక్రమం, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద జూబ్లీహిల్స్ పార్కుల నిర్వహణకు ఓకే చెప్పారు. జీహెచ్‌ఎంసీ అప్లికేషన్‌లను మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌కు మార్చడం, పారిశుధ్య కీటక నియంత్రణ కార్మికుల కోసం మొబైల్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. కార్పొరేషన్ ఆమోదం అవసరమైన ఇతర ముఖ్యమైన ప్రతిపాదనలను తదుపరి పరిశీలన కోసం రికమండ్ చేస్తూ, హైదరాబాద్ నగరాభివృద్ధికి జీహెచ్ఎంసీ కట్టుబడి ఉందని కమిటీ స్పష్టం చేసింది.
