Let's talk: editor@tmv.in
జీహెచ్ఎంసీ వ్యూహంపై దిశానిర్దేశం: కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ

జీహెచ్ఎంసీ వ్యూహంపై దిశానిర్దేశం: కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ

Gaddamidi Naveen
25 నవంబర్, 2025

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబీతా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. బల్దియా సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

పట్టణ పాలనలో పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ పారదర్శకంగా, అవినీతి ఆరోపణలకు తావు లేకుండా పనిచేసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రెండోసారి జీహెచ్ఎంసీలో గెలిచిన అనంతరం కరోనా మహమ్మారి వంటి అత్యంత క్లిష్ట సమయంలోనూ కార్పొరేటర్లు ప్రజలకు అందించిన సేవలను అందించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు . పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్ నగరంలోని కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తమ బాధ్యతను నిలబెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు.

ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కార్పొరేటర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి, పార్టీ విజయానికి శ్రమించిన తీరును ఆయన ప్రస్తావించారు. పార్టీ వెంటే నిలిచి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు, పదవులు ఇవ్వబడతాయని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికలను కార్పొరేటర్లు తమ ఎన్నికలుగా భావించి పనిచేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్న నేపధ్యంలో, అలాగే నియోజకవర్గాల పునర్విభజన వంటి మార్పులతో జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులకు మరింత భవిష్యత్తు ఎదురుచూస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజలతో అనుబంధం బలపరుచుకుంటూ, ప్రతి కాలనీలో సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేయాలని కార్పొరేటర్లకు సూచించారు. పార్టీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుందని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.