Let's talk: editor@tmv.in
జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

Shaik Mohammad Shaffee
26 నవంబర్, 2025

తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న మొత్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను) జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పెద్ద అంబర్ పేట్, జల్‌పల్లి, శంషాబాద్‌, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబాటియా, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్, బడంగ్‌‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రిమండలి నిర్ణయాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మీడియాకు వెల్లడించారు.

కేబినెట్ తీసుకున్న నిర్ణయాలివే

• హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగుళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14 వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని.. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్‌తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్వర్క్ వైర్లన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించింది.

• రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ రెండు డిస్కమ్‌లతో పాటు కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచి నీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి.

• రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, రాబోయే పదేళ్లకు అవసరమయ్యే విద్యుత్తు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి అంచనాలను కేబినేట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్తు విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను పరిశీలించింది. పునరుత్పాదక విద్యుత్తు వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం.. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,000 మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ నిర్ణయించింది.

• సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల కాల పరిమితితోనే ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలున్నాయి. పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంవోయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది.

• రాష్ట్రంలో 10 వేల మెగా వాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వమే అవసరమైన భూమిని కేటాయించి, నీళ్లను అందిస్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్ ను ముందుగా తమ డిస్కమ్ లకే అమ్మాలనే షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది.

• రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్తును తమతంట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది.

• రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ఎన్టీపీసీకి ఈ యూనిట్ నిర్మాణం అప్పగిస్తే ఎంత విద్యుత్ యూనిట్ రేట్ పడుతుంది.. జెన్ కో ద్వారా చేపడితే ఎంత రేట్ పడుతుందో.. ముందుగా అంచనాలు వేసుకొని తుది పరిశీలన చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

• భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

• ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

• జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.