
జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్య 300కు పెంపు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 150 నుంచి 300కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలు, జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో, జనాభా పెరుగుదల భౌగోళిక విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఈ వార్డుల సంఖ్య పెరిగింది. అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రణాళిక, నగర పరిపాలనలో సమర్థత పెంచేందుకు ఈ కొత్త నిర్మాణం అవసరమని నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో, జీహెచ్‌ఎంసీతో సహా ఈ 27 పట్టణ స్థానిక సంస్థలు కలిసి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పరిగణించబడతాయని పేర్కొంది. ఈ విస్తరణతో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ సంస్థలలో ఒకటిగా మారుతోంది. వార్డు సంఖ్య పెరగడంతో రాబోయే ఎన్నికలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ ఎన్నికైన మండలి పదవి 2026 ఫిబ్రవరిలో ముగియనుండగా, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికల ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఈ నిర్ణయం నగర పాలన విస్తరణకు దోహదం చేయడమే కాక, వేగంగా పెరుగుతున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించనుంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డులలో జనాభా గణనీయంగా పెరిగినట్లు గతంలో లభించిన ప్రభుత్వ గణాంకాలు వార్తా నివేదికలు తెలిపాయి.2011 జనాభా లెక్కల ప్రకారం, జీహెచ్‌ఎంసీ మొత్తం జనాభా సుమారు 67,31,790 గా నమోదు చేయబడింది.2011 నాటి డేటా ఆధారంగా, అప్పటి 150 వార్డులలో సగటున ఒక్కో వార్డుకు సుమారు 36,000 మంది జనాభా ఉండేవారు.అయితే, 2020 నాటి కొన్ని నివేదికల ప్రకారం, నగర జనాభా వృద్ధి చెందడంతో ప్రస్తుతం ఒక్కో వార్డులో సగటు జనాభా 40,000 నుంచి 50,000 మంది వరకు పెరిగినట్లు అంచనా వేయబడింది.
300 వార్డుల్లో సగటు జనాభా అంచనా
తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ వార్డుల సంఖ్యను 300కు పెంచిన నేపథ్యంలో, ఒక్కో వార్డులో ఉండే సగటు జనాభాపై అంచనాలు వెలువడుతున్నాయి.అధికారిక తాజా జనగణన (2021) విడుదల కానప్పటికీ, ప్రభుత్వం పట్టణాభివృద్ధి డాక్యుమెంట్ల ప్రకారం, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (జీహెచ్‌ఎంసీ, 27 అర్బన్) మొత్తం జనాభా సుమారు 1.05 నుంచి 1.12 కోట్లు మధ్య ఉంటుందని అంచనా.ఈ జనాభాను 300 వార్డులకు విభజిస్తే, సగటున ఒక్కో వార్డులో 35,000 నుంచి 38,000 మంది జనాభా ఉండే అవకాశం ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
