
జీహెచ్‌ఎంసీ ముక్కలు కాదు.. పాలనలో మూడు అడుగులు!
భాగ్యనగర పాలనా యంత్రాంగంలో తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కోర్ అర్బన్ రీజియన్ ఫ్రేమ్‌వర్క్ కింద హైదరాబాద్ రీజియన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ విభాగం జి.ఓ.ఎంఎస్. నెం.55 బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణతో హైదరాబాద్ ప్రాంతంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి.
పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. నగర విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలు, సమర్థవంతమైన పౌర సేవల అందుబాటు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వికేంద్రీకృత పరిపాలన ద్వారా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ పునర్విభజన.. జోన్లు, సర్కిళ్లు ఇలా..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుతుబుల్లాపూర్ ఉంటాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు కొనసాగనున్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు కలిగిన మిగిలిన ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా కొనసాగుతుంది. ఈ మూడు కార్పొరేషన్లు వేర్వేరు కార్పొరేట్ సంస్థలుగా పనిచేయనున్నాయి.
గత ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరించడంతో వార్డుల సంఖ్య 300కు పెరిగిన నేపథ్యంలో పరిపాలనా భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కొత్తగా పునర్నిర్మించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధి సుమారు 689 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులతో కొనసాగనుంది. ఈ మార్పుల ద్వారా పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడంతో పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, ట్రాఫిక్ నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కీలక బాధ్యతలు - ఐఏఎస్ అధికారుల నియామకం
ఈ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను సమన్వయం చేసేందుకు మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఐఏఎస్‌కు మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచే ఆయన ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ పరిపాలనా మార్పులను అమలు చేస్తున్నారు.
ఇక పునర్వ్యవస్థీకరణ అనంతరం పరిపాలనా నిరంతరత్వం కొనసాగించేందుకు సైబరాబాద్‌కు జి. శ్రీజన ఐఏఎస్, మల్కాజిగిరికి టి. వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ కమిషనర్లుగా నియమితులయ్యారు. ఆర్.వి. కర్ణన్, ఐఏఎస్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన పట్టణ పాలనా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడంపై ఆయన దృష్టి సారించారు.
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ పదవీ కాలం ఫిబ్రవరి 10తో ముగియడంతో, ప్రభుత్వం ప్రత్యేక అధికారులను, కమిషనర్లను నియమించింది. ఈ మార్పులతో హైదరాబాద్ మహానగర ప్రాంతంలో పట్టణ అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.
