
జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. నేతలకు కేటీఆర్ బాధ్యతల అప్పగింత
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది.
ప్రభుత్వంపై పార్టీ తరఫున చేపట్టాల్సిన పోరాట కార్యక్రమాలపై నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు బలంగా ప్రతిధ్వనింపజేయాలని, ప్రతి అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి సభలో ప్రస్తావించాలని ఆయన సూచించారు.గత రెండు సంవత్సరాల్లో పారిశుధ్యం నుంచి ప్రజా రవాణా వరకు ప్రతి రంగంలోనూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పారిశ్రామిక ప్రగతి, వ్యాపార వాణిజ్యాలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలు, భూములపై దృష్టి సారించిన విధానాల వల్లే హైదరాబాద్ ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని కేటీఆర్ ఆరోపించారు. ‘హైడ్రా’, పారిశ్రామిక భూముల కేటాయింపులు, టీడీఆర్ పేరుతో స్కామ్‌లు జరుగుతున్నాయని విమర్శించారు. ఉన్న నగర అభివృద్ధిని పక్కనబెట్టి ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెట్రో నగరంగా తీర్చిదిద్దామని, కరెంట్ కోతలు లేకుండా తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతులను మెరుగుపరిచామని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నగరాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తోందని విమర్శించారు.
కీలక బాధ్యతల అప్పగింత
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమన్వయం, ఫాలోఅప్ బాధ్యతలను పలు నేతలకు అప్పగించారు. జీహెచ్ఎంసీ వ్యవహారాల సమన్వయానికి ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లను నియమించారు. మల్కాజిగిరి కార్పొరేషన్ బాధ్యతలను ఎమ్మెల్సీ శంబిపూర్ రాజుకు అప్పగించగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు.
పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేసి నగరంలో బీఆర్ఎస్ బలం మరింత పెంచాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ముఖ్య నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
