Let's talk: editor@tmv.in
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత మొబైల్ క్యాన్సర్ అవగాహన, పరీక్షా శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కార్కినోస్ హెల్త్‌కేర్ సహకారంతో, ఇండియన్ క్యాన్సర్ సొసైటీ మద్దతుతో నిర్వహించడం విశేషం.

ఈ మొబైల్ ఆరోగ్య శిబిరాల్లో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళల కోసం నోటి క్యాన్సర్, స్తన క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్షలు నిర్వహించగా, పురుషుల కోసం నోటి క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా చికిత్స సులభంగా, ఫలప్రదంగా ఉండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, సమయానికి పరీక్షలు చేయించుకోవడం ఎంత అవసరమో కూడా వివరించారు.

కార్మికుల్లో పెరిగిన ధైర్యం

ఈ శిబిరంలో పాల్గొన్న పారిశుధ్య కార్మికులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు. క్యాన్సర్ అనే వ్యాధి పట్ల ఉన్న భయం ఈ పరీక్షల ద్వారా తగ్గిందని, తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలనే నమ్మకం కలిగిందని తెలిపారు. తమను కేవలం ఉద్యోగులుగా కాకుండా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని పేర్కొన్నారు.

మలక్‌పేట్‌కు చెందిన పారిశుధ్య కార్మికురాలు ఎ. లక్ష్మమ్మ మాట్లాడుతూ, ఈ ఉచిత మొబైల్ క్యాన్సర్ పరీక్షా శిబిరం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. వ్యాధిని ముందుగానే గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు ఇది ఎంతో మేలు చేస్తుందని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన ఉద్యోగుల సంక్షేమం, నివారణాత్మక వైద్య సేవలపై ఉన్న కట్టుబాటును మరోసారి స్పష్టంగా తెలియజేసింది. నగరానికి సేవ చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటం సమాజానికి మేలు చేసే ఆదర్శ చర్యగా నిలుస్తోంది.