Let's talk: editor@tmv.in
జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో కుక్కపిల్లల దత్తత మేళా

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కులో కుక్కపిల్లల దత్తత మేళా

Gaddamidi Naveen
15 ఫిబ్రవరి, 2026

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ కుక్కపిల్లల దత్తత మేళా ఆకట్టుకుంది. “బీ ఎ హీరో… అడాప్ట్, డోంట్ షాప్” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పార్లమెంట్ సభ్యురాలు రేణుకా చౌదరి కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు దత్తత తీసుకున్న వారితో ముచ్చటించి, వారికి కుక్కపిల్లలను అందజేశారు. కుక్కలు ఎప్పుడూ మానవులకు విశ్వసనీయమైన నేస్తాలని, వాటిని కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూడాలని వారు పిలుపునిచ్చారు. విదేశీ జాతుల కంటే మన స్వదేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకోవడం వల్ల వీధి కుక్కల సంఖ్య తగ్గుతుందని, అవి మన వాతావరణానికి త్వరగా అలవాటు పడతాయని వారు పేర్కొన్నారు.

ప్రేమకు చిహ్నంగా దత్తత

ఈ మేళాలో ఆరోగ్యవంతమైన, టీకాలు వేయబడిన, నులిపురుగుల నివారణ చేసిన 50 కుక్కపిల్లలను ప్రదర్శించగా, అందులో 30 పిల్లలను నగరవాసులు ఉత్సాహంగా దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న వారు క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ (సంతాన నిరోధక శస్త్రచికిత్స) చేయించాలని అధికారులు సూచించారు. వాలెంటైన్స్ డే మనుషులకు, మూగజీవాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి ఇదొక ఉత్తమ మార్గమని, మరింత మంది నగరవాసులు ముందుకు వచ్చి ఈ మూగజీవాలకు ఆశ్రయం ఇవ్వాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.