Let's talk: editor@tmv.in
జీవో 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలి: సీఎం రేవంత్‌కు కవిత లేఖ

జీవో 317 బాధితులకు వెంటనే న్యాయం చేయాలి: సీఎం రేవంత్‌కు కవిత లేఖ

Sirisha B
31 మార్చి, 2026

రాష్ట్రంలో జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తక్షణమే న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె లేఖ రాశారు.

2021లో జారీ చేసిన జీవో వల్ల ఉద్యోగుల ఇబ్బందులు

2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 వల్ల అనేక మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ స్వస్థలాలకు దూరంగా ఉన్న కొత్త జిల్లాలకు బదిలీ అయ్యారని కవిత గుర్తుచేశారు.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో సీనియారిటీ ఆధారంగా చేసిన పోస్టింగ్స్ కారణంగా ప్రత్యేకించి ఎనిమిదేళ్లలోపు సేవ ఉన్నవారు అన్యాయానికి గురయ్యారని తెలిపారు. జీవో 317 రద్దు చేయాలని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు రాసిన లేఖను కూడా కవిత ప్రస్తావించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో 317ను సమీక్షించి బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు.

జీవో 317 సమస్యను పరిష్కరించేందుకు అప్పటి సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదిక ఇప్పటివరకు బయట పెట్టకపోవడాన్ని కవిత ప్రశ్నించారు. నివేదికను ప్రకటిస్తేనే బాధితుల అసలు సంఖ్య స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. నివేదిక ఏమయ్యిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.

జీవో 243, 244, 245 జారీ చేసినా, ఆ తరువాత ఉద్యోగుల ఆందోళనలతో ప్రభుత్వం బుజ్జగింపుగా తెచ్చిన జీవో 1930 వచ్చినా, జీవో 317 బాధితులకు ఏ ప్రయోజనమూ అందలేదని కవిత పేర్కొన్నారు.

కవిత సీఎం రేవంత్‌కి పంపిన లేఖలో ప్రధాన డిమాండ్లు ఇవి:

• జీవో నెం.317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులకు “వన్ టైమ్ రిలీఫ్” ఇవ్వాలి.

• ఉద్యోగుల స్థానికత ఆధారంగా, వారికి వారి స్వస్థలాల్లోనే పోస్టింగులు ఇవ్వాలని వెంటనే ఆదేశాలు జారీ చేయాలి.

• స్థానికతను నిర్ణయించే నిబంధనల్లో ఉన్న లోపాలను పూర్తిగా సవరించి, ఉద్యోగులకు అన్యాయం జరగకుండా సమూల మార్పులు చేయాలి.

ఇప్పటికీ వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మీ మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటూ తిరగాల్సి వస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత విన్నవించారు.