Let's talk: editor@tmv.in
జీవో 252పై భగ్గుమన్న జర్నలిస్టులు.. అరెస్టు చేసిన పోలీసులు

జీవో 252పై భగ్గుమన్న జర్నలిస్టులు.. అరెస్టు చేసిన పోలీసులు

Gaddamidi Naveen
28 డిసెంబర్, 2025

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అక్రిడిటేషన్ నిబంధనల జీవో 252 పేరుతో జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో డెస్క్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శ‌నివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కొత్త జీవో వల్ల అనేక మంది అర్హత కలిగిన జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని వారు విమర్శించారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతూ, ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయాలని ఫెడరేషన్ నాయకులు ప్రయత్నించారు. అయితే ముందస్తు అనుమతి లేదని పేర్కొంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన జర్నలిస్టు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకుని, జర్నలిస్టుల అక్రిడిటేషన్ విధానంలో న్యాయమైన మార్పులు చేయాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండించిన కేటీఆర్

అక్రిడిటేషన్ల కోతకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కేవలం నేతల అరెస్ట్ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను పోలీసు బలగాలతో నొక్కేసే కుట్ర అని ఆయన విమర్శించారు.

కేటీఆర్ వ్యాఖ్యల ప్రకారం, కొత్త జీవో ద్వారా జర్నలిస్టుల అక్రిడిటేషన్లలో కోత విధించడం ప్రభుత్వం వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని, ప్రశ్నించిన వారిపై దాడులు జరిపి నిరంకుశత్వానికి మించిన ఉదాహరణను చూపిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామిక పరిరక్షణ పేరుతో ఇచ్చిన ఏడవ గ్యారంటీ అంటే నిజానికి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం మాత్రమేనా? అని ఆయన ప్రశ్నించారు.

అనేక జర్నలిస్టులు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమించే డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టుల కోసం ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్ల మంజూరును ఇవ్వాల్సిన అవసరం ఉండగా, ఉన్న కార్డులను తొలగించడం ద్వారా వారి ఉపాధి, ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లు కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా మారుతి సాగర్, రమేశ్ హజారి, యోగానంద్, విష్ణువర్ధన్ రెడ్డి, రమణ కుమార్, కడకంచి వెంకట్ వంటి నాయకులను అరెస్ట్ చేయడం దారుణం అని పేర్కొన్నారు.

కేటీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే కొత్త జీవోని రద్దు చేయాలని, జర్నలిస్టుల అక్రమ అరెస్టులు, కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ల పునరుద్ధరణ కోసం జరగనున్న పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్కన నిలుస్తుందన్నారు. ఆయన ప్రజల గొంతుకను నొక్కే చర్యలు, మీడియా స్వేచ్ఛకు హానికరమైన నిర్ణయాలు, ప్రభుత్వ నిరంకుశత్వానికి ఉదాహరణ అని ఆయ‌న పేర్కొన్నారు.