Let's talk: editor@tmv.in
జీవో 1426ను వెంటనే ఉపసంహరించుకోవాలి: నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి

జీవో 1426ను వెంటనే ఉపసంహరించుకోవాలి: నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి

Gaddamidi Naveen
23 జులై, 2026

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1426 ద్వారా ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తమ చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, 'అగ్రీడ్ లిస్ట్' పేరుతో వారిపై నిఘా పెట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగం, అత్యంత కీలక బాధ్యతలు నిర్వహించే అధికారుల కోసం రూపొందించిన విధానాలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై అమలు చేయడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గెజిటెడ్ అధికారిని అనుమానాస్పదంగా చూస్తూ ప్రత్యేక జాబితాలు రూపొందించి నిఘా పెట్టడం నిరంకుశ ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి ఉత్తర్వులు లేవని, ఈ జీవోను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వం వివిధ శాఖల్లో అధికారులను బదిలీలు, కేసుల పేరుతో భయపెట్టి తమకు అనుకూలంగా పనిచేయించే ప్రయత్నం చేస్తోందని చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి సోషల్ మీడియా కేసులు నమోదు చేయిస్తున్నారని, ఇప్పుడు అదే తరహా ఒత్తిడిని అన్ని శాఖల్లోనూ తీసుకురావడానికే జీవో 1426ను అమల్లోకి తీసుకువచ్చారని విమర్శించారు.

ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత జీవనశైలి, వారు కొనుగోలు చేసే వాహనాలపై కూడా నిఘా పెట్టి కేసులతో బెదిరించే పరిస్థితి నెలకొల్పుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే ఏసీబీ, విజిలెన్స్ వంటి వ్యవస్థలు ఉండగా, జీఏడీ ఆధ్వర్యంలో మరో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం అధికారులను లొంగదీసుకునేందుకేనని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ మెడికల్ కళాశాలలు, పోర్టులు, ఆర్టీసీ డిపోలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సేవా కేంద్రాల పేరుతో తీసుకొచ్చిన విధానాల వల్ల వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పటికే వారికి ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. జీవో నంబర్ 1426ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.