
జీవో కాదు, అమలు కావాలి: కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే పాయల్ విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత పాయల్ శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి, ఆ హామీని మళ్లీ మోసపూరితంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పదేపదే బీసీలను మోసం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఆ తర్వాత ఓ చిన్న జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప, న్యాయం చేయలేదన్నారు. మేము అసెంబ్లీలో అప్పుడే హెచ్చరించాయని తెలిపారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలు, జీవోలు కాదు, అమలు చేయగల చట్టపరమైన చర్యలు తీసుకురావాలని తెలిపారు. కానీ కాంగ్రెస్ అదే పాత నాటకాన్ని మళ్లీ ఆడిందని విమర్శించారు. ఇప్పటికీ ప్రభుత్వం హైకోర్టులో సరైన విధంగా వాదించలేకపోవడం, డేటా సమర్పణలో, న్యాయపరమైన వివరణల్లో స్పష్టత లేకపోవడం వల్లే 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిందని తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అజ్ఞానం, అంకితభావం లోపాన్ని స్పష్టంగా చూపిస్తుంది. బీసీల న్యాయం కోసమని చెప్పుకునే వారు ఇప్పుడు వారిని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
బీసీలు తెలంగాణ అభివృద్ధిలో మమేకం అయి ఉన్నారన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి రంగంలోనూ వారి కృషి ఉంది. అయితే వారికి సరైన రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడంలో కాంగ్రెస్ ఎప్పుడో విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా బీసీల వాదనలు, డిమాండ్లు అదే స్థాయిలో మిగిలిపోయాయి. ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తుంది. కానీ బీజేపీ మాత్రం బీసీలకు న్యాయం చేయడం, నిజమైన సామాజిక సమానత్వం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. మేము బీసీల హక్కుల కోసం అసెంబ్లీ లోపల, వెలుపల పోరాడతాం. హైకోర్టులో అవసరమైతే బీసీల తరఫున బలమైన న్యాయపరమైన వాదనలు కూడా చేస్తామని పేర్కొన్నారు.
కేంద్ర స్థాయిలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించి, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చివరి హెచ్చరిక. బీసీలను ఇక మోసం చేయలేరని, న్యాయం చేయకపోతే ప్రజల తీర్పు తీవ్రంగా ఉంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు.
