Let's talk: editor@tmv.in
జీవీఎంసీ ఇంజనీర్ మృతి పై న్యాయ విచారణ జరపాలి: వైసీపీ

జీవీఎంసీ ఇంజనీర్ మృతి పై న్యాయ విచారణ జరపాలి: వైసీపీ

Panthagani Anusha
26 జనవరి, 2026

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ) గోవిందరావు శనివారం సమీక్షా సమావేశంలో కుప్పకూలి మరణించడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. విధుల నిర్వహణలో ఉన్నత స్థాయి అధికారి ఇలా అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అటు అధికార యంత్రాంగంలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ మరణం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుండగా అది కేవలం అనారోగ్య కారణమేనని పాలక పక్షం స్పష్టం చేస్తోంది.

కాగా ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ స్పందిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. సమీక్షా సమావేశంలో చైర్మన్ పట్టాభిరామ్ తన అధికారాన్ని ప్రదర్శిస్తూ గోవిందరావును తీవ్రంగా అవమానించారని ఆయన ఇచ్చిన వివరణలను కనీసం వినకుండా అహంకారపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. పట్టాభిరామ్ మాట్లాడిన మాటల మనస్తాపం వల్లే ఎస్‌ఈ గుండెపోటుతో కుప్పకూలిపోయారని ఇందుకు ప్రభుత్వ వైఖరే కారణమని ఆయన ధ్వజమెత్తారు. అసలు ఆ సమీక్షా సమావేశం నిర్వహించాల్సిన అవసరమే లేదని పేర్కొంటూ అధికారి మృతిపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రాజకీయం చేయడం దురదృష్టకరం: పట్టాభిరామ్

మరోవైపు ఈ ఆరోపణలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కొమ్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. చెత్త బదిలీ కేంద్రాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు వాహన సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఎస్‌ఈ గోవిందరావుకు ముందు నుంచే మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని సమావేశంలో ఆయనకు అకస్మాత్తుగా వైద్య అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ) ఏర్పడిందని వివరించారు. అక్కడ ఎలాంటి గొడవలుజరగలేదని సంఘటనను వైసీపీ నేతలు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, కుటుంబ సభ్యులు వైద్యుల సలహాను పక్కన పెట్టి మరో ఆస్పత్రికి తరలించే లోపు రెండోసారి స్ట్రోక్ వచ్చి ఆయన మరణించారని పట్టాభి వివరణ ఇచ్చారు. ప్రత్యక్ష సాక్షులుగా పలువురు అధికారులు ఉన్నప్పటికీ, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. నిబద్ధత గల అధికారి మృతిపై న్యాయ విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రతిపక్ష నేతలు పట్టుబడుతున్నారు.