
జీతాల కోసమే వైసీపీ నాయకులు సభకు వచ్చారు: జనసేన ఎమ్మెల్యేలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చట్టసభలన్నా ప్రజాస్వామ్య సంప్రదాయాలన్నా కనీస గౌరవం లేదని జనసేన ఎమ్మెల్యేలు లోకం మాధవి సుందరపు విజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రగతిపై చర్చించాల్సిన సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేయడం ద్వారా సభా మర్యాదను మంటగలిపారని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదానే అంత ముఖ్యమైతే తాడేపల్లి ఇంట్లోనే అసెంబ్లీ సెట్ వేయించుకుని బొత్స సత్యనారాయణను స్పీకర్‌గా పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
వైకాపా ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించడానికి కాకుండా కేవలం జీతాల కోసం అటెండెన్స్ వేయించుకోవడానికే సభకు వస్తున్నారని లోకం మాధవి విమర్శించారు. ఆరు నెలలు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందన్న భయంతోనే పది నిమిషాలు కూర్చుని, 11వ నిమిషంలో బయటకు వెళ్లిపోయారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా పేపర్లు చింపి, పోడియం వద్ద అరాచకం సృష్టించాలని జగనే స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన వల్లే ప్రజలు ఆ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేశారని, అయినా జగన్‌లో మార్పు రాలేదని విమర్శించారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన పాపం వారిని వదలదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో టీడీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కుట్రలు పన్నిన జగన్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని హోదా అడుగుతున్నారని విజయ్ కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని చెప్పారు. ఇప్పటికైనా వైకాపా నేతలు బూతు పురాణాలు మానేసి ప్రజా సమస్యలపై చర్చించడానికి సభకు రావాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు మరింత ఘోరంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
