Let's talk: editor@tmv.in
జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ఊరట: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​

జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ఊరట: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​

Pinjari Chand
12 అక్టోబర్, 2025

వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు భారీ ఊరట కలిగించిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ యంత్రాలపై జీఎస్టీ తగ్గించడంతో రైతులకు పెద్ద ఉపశమనం లభించిందని, తద్వారా చిన్న ట్రాక్టర్లపై సుమారు రూ.23,000, 35 హెచ్‌పీ ట్రాక్టర్‌పై రూ.41,000, పెద్ద ట్రాక్టర్లపై రూ.63,000 వరకు ఆదా అవుతుందని వివరించారు. అలాగే అనేక యంత్ర పరికరాలు కూడా తక్కువ ధరకు లభిస్తున్నాయని చౌహాన్ వివరించారు. ఎప్పుడూ ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని కొనియాడారు. రైతులకు ప్రయోజనాలు అందే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీ పడదని, వారి సంక్షేమమే మా ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వేదికపై ప్రకటించారు.

ఇదే సమయంలో రాబోయే రబీ పంటల కనిష్ఠ మద్దతు ధర పెంపును కూడా ఆయన ప్రస్తావించారు. రైతులు తమ పంటకు సరైన ధర పొందేలా ప్రధాని మోదీ ఎంఎస్పీని పెంచారని, ఇప్పటి వరకు పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా రూ. 3.9 లక్షల కోట్లు జమయ్యాయని తెలిపారు.

చివరి గింజ వరకు కొంటాం

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రబీ మార్కెటింగ్ సీజన్ 2026-27 కోసం సుమారు 297 లక్ష మెట్రిక్ టన్నుల పంటలను కొనుగోలు చేయనున్నారు. దీని ద్వారా రైతులకు రూ. 84,263 కోట్లు మద్దతు ధర రూపంలో లభిస్తాయి. ఈ సీజన్‌లో గోధుమలపై 109% లాభ మార్జిన్ నిర్ణయించారు. (రైతు పంట పండించడానికి వెచ్చించిన ఉత్పత్తి వ్యయంపై 109 శాతం అదనంగా ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది.) అదేవిధంగా కందులు, ఉలవలు, మినపపప్పు పంటల కొనుగోళ్లు కూడా 2028-29 వరకు 100 శాతం ఉత్పత్తి(ఎంతపండితే అంత పంట మొత్తం, చివరి గింజ) వరకు కొనుగోలు చేస్తామని కేంద్రమంత్రి చౌహాన్ గుర్తు చేశారు. రైతులు ప్రతి సారి వాతావరణ మార్పులు, ధరల మార్పులతో చాలా సార్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మద్ధతు ధర చర్యలతో రైతుల ఆదాయ భద్రతకు ప్రభుత్వం గట్టి హామీ ఇస్తోందని అన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో రైతులకు ఊరట: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్​ - Tholi Paluku