
జీఎస్టీ కేసులో స్థిరాస్తులు అటాచ్ చేసిన ఈడీ
జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో 135 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి కొంతమంది వ్యక్తులు మోసానికి పాల్పడడంతో ఈడీ వారి ఆస్తులను అటాచ్ చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శివకుమార్ దేవరా, అమిత్ గుప్తా, సుమిత్ గుప్తా, అమిత్ అగర్వాల్ లు కలిసి సిండికేట్ పద్ధతిలో కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ కంపెనీల నుంచి ఎటువంటి వస్తువులు సరఫరా కాకుండానే జీఎస్టీ ఇన్ వాయిస్ లు జారీచేశారు. దీంతో రూ.734 కోట్లకు పైగా విలువైన నకిలీ ఇన్ ఫుట్ టాక్స్ క్రెడిట్ ని మోసపూరితంగా సృష్టించి బదిలీ చేశారని ఈడీ అధికారులు తెలిపారు. దీంతో సెప్టెంబర్ 29 న రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయం పశ్చిమబెంగాల్, హౌరాలో అమిత్ గుప్తా, అతని సహచరులకు చెందిన రూ. 15.41 విలువైన స్థిరాస్తులను మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అటాచ్ చేసింది. వీరిపై గతంలోనే అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఈ జీఎస్టీ నుంచి తప్పించుకోవడం వల్ల నిందితులు రూ.67 కోట్ల కమిషన్ సంపాదించారని, ఇది ఆక్రమ ఆదాయమని విచారణలో తేలిందని ఈడీ అధికారులు తెలిపారు. అమిత్ గుప్తా ఈ ఆదాయాన్ని సక్రమమైన ఆదాయంగా చూయించడానికే స్థిరాస్తులను కొనుగోలు చేశారన్నారు. దర్యాప్తులో అనేక విషయాలను వెల్లడించలేదని, ఉద్దేశ పూర్వకంగా వారు దర్యాప్తుకు సహకరించలేదన్నారు. ఈ ఏడాది మే 8న ఈడీ సోదాలు నిర్వహించి శివకుమార్ దేవ్ రా, మోహిత్, అమిత్ గుప్తా, అగర్వాల్ లను అరెస్ట్ చేశారు. వీరు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
