
జీఎస్టీకి అడ్డుపడుతున్న కాంగ్రెస్: ప్రధాని మోడీ
మేం పేదప్రజల కోసం ఆలోచించి జీఎస్టీలో సంస్కరణలు తెస్తే కాంగ్రెస్ అడ్డుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. జార్సుగూడలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అన్ని వస్తువులపై కేంద్రం జీఎస్టీ సవరించినప్పటికీ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రయోజనం ప్రజలు పొందకుండా గోడల అడ్డుకుంటుందని, ఇంధనం, సిమెంట్ పై అదనపు పన్నులు విధించి ప్రజలను దోపిడీ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోటల్లా ఇలాగే వ్యవహరిస్తుందని అన్నారు.
నన్ను రకరకాలుగా దుర్భషలాడడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని వారే అన్నారు. ప్రస్తుతం అనేక సంస్కరణలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటే వారేమో సిమెంట్ పై ధరలు పెంచి పేదలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు అందకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. గతంలో కూడా పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించినప్పుడు కూడా కాంగ్రెస్ ఇలాగే వ్యవహరించిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న దగ్గర పెట్రోల్, డిజిల్ పై అదనపు పన్నులు వేసి ప్రజల నుంచి దోచుకుని ఖజానాను నింపుకుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడున్నా అక్కడ ప్రజలను నిలువునా దోచుకుంటుందని ఎద్దేవా చేశారు. 2014 కంటే ముందు పరిస్థితి ఎలా ఉండేదో మీకు బాగా తెలుసు. కాంగ్రెస్ మిమ్మల్ని దోచుకోవడాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. మీరు మాకు అధికారం ఇచ్చినప్పుడు వారి దోపిడీకి అడ్డుకట్ట వేశాం. మిమ్మల్ని కాంగ్రెస్ అవినీతి వ్యవస్థ నుంచి విముక్తి చేశామని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రజల పొదుపు, ఆదాయం బాగా రెట్టింపయ్యాయని అన్నారు.
