Let's talk: editor@tmv.in
జిల్లాల రద్దు లేదు.. సింగరేణి మెడికల్ బోర్డు జోలికి వెళ్లం: సీఎం రేవంత్ రెడ్డి

జిల్లాల రద్దు లేదు.. సింగరేణి మెడికల్ బోర్డు జోలికి వెళ్లం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో జిల్లాల రద్దు, సింగరేణి మెడికల్ బోర్డు విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. జిల్లాల తొలగింపు గానీ, కొత్త జిల్లాల ఏర్పాటు గానీ ప్రభుత్వ ఆలోచనలో లేదని ఆయన తేల్చి చెప్పారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా ఆదివారం భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

కొన్ని వర్గాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలుచుకున్నామని, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా అవి ప్రజలకు బహిరంగంగా తెలియజేసి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను భూపాలపల్లి ప్రజలు గుర్తించగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భూపాలపల్లిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు.

సింగరేణి కార్మికులకు భరోసా

సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని కూడా సీఎం ఖండించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు విస్తరించిన సింగరేణి పరివాహక ప్రాంతంలో వేలాది కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయని, కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తారని, వారసత్వ ఉద్యోగాలు పోతాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుందని, కార్మికులకు నష్టం కలిగే నిర్ణయం తీసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. సింగరేణి గని కార్మికుల కృషి వల్లే ప్రభుత్వం నిలబడిందని ఆయన గుర్తుచేశారు.

గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక దళితులను నిరాశపరిచారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ని శాసనసభ స్పీకర్‌గా నియమించి గౌరవ స్థానాన్ని కల్పించిందని సీఎం తెలిపారు. అందుకే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

ఆధ్యాత్మికం - పర్యాటకం

2027లో నిర్వహించనున్న పుష్కరాలపై కూడా ముఖ్యమంత్రి వివరించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను పర్యాటక, పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆయ‌న తెలిపారు. అటవీ ప్రాంతాల్లో రిసార్టులు నిర్మించి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో సరస్వతి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించామని, అలాగే సమ్మక్క–సారలమ్మ జాతరను దక్షిణ కుంభమేళాగా గుర్తింపు పొందేలా నిర్వహించామని పేర్కొన్నారు. మేడారం జాతరకు సుమారు రెండు కోట్ల మంది భక్తులు హాజరైనట్లు సీఎం తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 6,116 కోట్లను కేటాయించిందని సీఎం వెల్లడించారు. ఈ సభ వేదిక నుంచి ‘సమ్మక్క - సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు రూ. 205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును ఆయన అందజేశారు. తెలంగాణ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు పోషించిన పాత్రను ఆయన స్మరించుకున్నారు.

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ నాయకత్వంలో గత రెండేళ్లలో దాదాపు రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం సాగునీటికి సంబంధించిన మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగనున్నాయని తెలిపారు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్‌తో రూ. 1,500 కోట్ల వసూళ్లు..సీఎం

గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌ను ఉపయోగించి వ్యాపారులను బ్లాక్‌మెయిల్ చేసి వందల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ను “బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి”గా అభివర్ణించారు. మాజీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు మాత్రమే కాకుండా, హైకోర్టు న్యాయమూర్తులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు వంటి పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన ఆరోపించారు. వ్యక్తిగత సంభాషణలను కూడా వినిపించి, ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసి వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారని సీఎం గుర్తుచేశారు.

ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో భూముల కొనుగోళ్లలో ఒత్తిడి తీసుకువచ్చి, తక్కువ ధరలకు ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల బాండ్ల రూపంలో సుమారు రూ. 1,500 కోట్లు సేకరించారని ఆయన అన్నారు. వేల కోట్ల విలువైన ఆస్తులు, వందల ఎకరాల భూములు బెదిరింపుల ద్వారా సంపాదించారని ప్రశ్నించారు. ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఆయన ప్రశ్నించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగిన తప్పులు ఎప్పటికైనా శిక్ష తప్పవని సీఎం హెచ్చరించారు. ఈ కేసుల భారంతో బీఆర్‌ఎస్ రాజకీయంగా కూలిపోతుందని వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎనిమిది స్థానాలు గెలిచేలా బీఆర్‌ఎస్ సహకరించిందని, కేసుల నుంచి తప్పించుకోవడమే లక్ష్యమని ఆరోపించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే విధంగా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివని, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ - బీజేపీ ఒక్కటే

ఇంతకుముందు నిజామాబాద్‌లో జరిగిన సభలో కూడా బీఆర్‌ఎస్, బీజేపీలను విడదీయలేని “వీణా–వాణి”లతో పోల్చిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో అనధికారికంగా ఫోన్ సంభాషణలను గమనించడం, పలు ప్రముఖులపై నిఘా పెట్టడం వంటి ఆరోపణలకు సంబంధించినది. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావును ఇటీవల తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించిన విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వంపై కూడా సీఎం విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణలపై లేదా ఫార్ములా–ఈ రేస్ కేసులో సీబీఐ దర్యాప్తు ఎందుకు ఆదేశించలేదని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు నమోదు చేయడాన్ని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలను రక్షిస్తున్నారని సీఎం ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను సీఎం కోరారు. కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా భూపాలపల్లి ప్రాంతానికి తగిన అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భూపాలపల్లిని సందర్శించలేదని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పేదల కష్టాలు తెలిసిన ప్రజా ప్రభుత్వం ఇది అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని, అలాగే పట్టణాల్లో కూడా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

బహిరంగ సభకు ముందు సీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశీర్వచనం స్వీకరించారు. దేవాలయ అతిథి గృహంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం, ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.