
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా స్వల్ప మార్పులతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వెలగపూడిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో తుది నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 31న జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
గత నెల 27న ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 927 అభ్యంతరాలు,సూచనలు వ్యక్తమయ్యాయి. వీటిపై సమగ్రంగా చర్చించిన ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే విలీనం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో 'నక్కపల్లి' బదులుగా 'అడ్డరోడ్డు జంక్షన్' కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని, మునగపాకను అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని ఆదేశించారు.
పాలనా సౌలభ్యం కోసం మరికొన్ని భౌగోళిక మార్పులను కూడా సీఎం ఖరారు చేశారు. రాయలసీమ ప్రాంతంలో రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టలను కడప జిల్లాలో విలీనం చేసే అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోనిని రెండు మండలాలుగా విభజించేందుకు మొగ్గు చూపారు. కాగా రంపచోడవరం కేంద్రంగా ప్రతిపాదించిన పోలవరం జిల్లాలో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారమే అది కొనసాగుతుందని సీఎం వెల్లడించారు.
ఇక ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ పలు మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలాన్ని టెక్కలి డివిజన్‌కు, కాకినాడ జిల్లా సామర్లకోటను పెద్దాపురం డివిజన్‌కు మార్చారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి డివిజన్‌లోని పలు మండలాలను, కనిగిరి డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలను కందుకూరు డివిజన్‌లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనూ రెవెన్యూ డివిజన్ల పరిధిని సవరించారు. మడకశిరలో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అనిత రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొని మార్పుల సాధ్యాసాధ్యాలను వివరించారు.
