
జిల్లాల జోలికొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం: కేటీఆర్ హెచ్చరిక
తెలంగాణలో జిల్లాల పునర్విభజన అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కార్చిచ్చు రగిలిస్తోంది. జిల్లాల పునర్విభజన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తేనెతుట్టెను కదుపుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొచ్చిన 33 జిల్లాల వ్యవస్థను రద్దు చేయాలనే దురుద్దేశంతోనే రేవంత్‌రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఏ జిల్లాను ముట్టుకున్నా అక్కడికక్కడ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. జిల్లాల జోలికొస్తే అగ్గి రాజేస్తాం అంటూ కేటీఆర్ హెచ్చరిక ఇచ్చారు.
కేసీఆర్ హయాంలో కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులను ప్రజల చెంతకే తీసుకొచ్చేలా జిల్లాల పునర్విభజన జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. పరిపాలన ప్రజలకు చేరువ కావాలన్నదే ఆ నిర్ణయానికి మూలమని తెలిపారు. అలాంటి వ్యవస్థను ఇప్పుడు రద్దు చేస్తామని రేవంత్‌రెడ్డి అనడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రజల ఆకాంక్షలకు అవమానమని విమర్శించారు. గద్వాల, వనపర్తి, నారాయణపేట ప్రజలు ఊరుకుంటారా? వారి జిల్లాలను రద్దు చేస్తే చూస్తూ ఊరుకుందామా? అంటూ ప్రశ్నించారు.
ప్రజల పోరాటాల ఫలితమే జిల్లాల ఏర్పాటు
33 జిల్లాల ఏర్పాటు ఏకపక్ష నిర్ణయం కాదని, ప్రజల దీర్ఘకాల డిమాండ్లు, ఉద్యమాల ఫలితమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కడి ప్రజల దశాబ్దాల పోరాటానికి నిదర్శనమని తెలిపారు. అలాగే సిరిసిల్ల, జనగామ, గద్వాల, ములుగు వంటి జిల్లాలు ప్రజలు రోడ్డెక్కి, ఆందోళనలు చేసి సాధించుకున్నవేనని గుర్తుచేశారు. అవి ఎవరూ ఉచితంగా ఇచ్చినవి కావని, ప్రజాభిప్రాయం లేకుండా ఏర్పాటు చేసినవీ కావని స్పష్టం చేశారు. మరి అలాంటి జిల్లాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దండెత్తుతోందని నిలదీశారు.
పాలమూరు నుంచే మార్పు మొదలైంది
పాలమూరు నుంచే మార్పు మొదలైందని, మొన్నటి పంచాయతీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, రెండేళ్లు తిరగకుండానే పల్లెల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే మార్పు స్పష్టంగా కనిపిస్తుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన అబద్ధపు మాటలు, అడ్డగోలు హామీల గురించి ప్రజలందరికీ తెలుసునని విమర్శించారు.
ఐటీ హబ్, పరిశ్రమలపై ప్రశ్నల వర్షం
ఈ నెల 17న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌కు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ సూటిగా ప్రశ్నలు సంధించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరులో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేసి, అక్కడికి 14 పరిశ్రమలను తీసుకొచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీలు ఎందుకు వెళ్లిపోయాయో తెలంగాణ యువతకు, ముఖ్యంగా మహబూబ్‌నగర్ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరుకు ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా? బీఆర్‌ఎస్ తెచ్చిన పరిశ్రమలకు వచ్చి రిబ్బన్లు కట్ చేయడం తప్ప నువ్వు చేసింది ఏమిటి? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఐటీ పార్కులో కంపెనీలు ఎందుకు పారిపోయాయో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని ఆయన పేర్కొన్నారు.
పరిపాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించే ఎత్తుగడ
జిల్లాల పునర్విభజన చర్చ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చిన ఎత్తుగడ మాత్రమేనని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసే దురుద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఏ జిల్లా రద్దవుతుందో తెలియక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు.
తెలంగాణలో నిర్మాణాత్మక అభివృద్ధిని వదిలేసి, ఉన్న వ్యవస్థలను కూలగొట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపించింది. జిల్లాల వ్యవస్థపై చేయి వేయడం ద్వారా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయానికైనా బీఆర్‌ఎస్ తీవ్రంగా ఎదురొడుతుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
