Let's talk: editor@tmv.in
జిల్లాల్లో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డు

జిల్లాల్లో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డు

Gaddamidi Naveen
29 సెప్టెంబర్, 2025

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా మోసం చేసింద‌ని పేర్కొంటూ బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేత‌లు ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఆదివారం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ చేప‌ట్టారు. ఈ సందర్భంగా జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమ‌ర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన తీరు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించిందన్నారు. అధికారం కోసం అడ్డమైన హామీలతో ప్రజలను ఆశపెట్టి గద్దెనెక్కిన తర్వాత అవి గాలికొదిలేశారన్నారు. ఈ ‘బాకీ కార్డు’ ద్వారా ఆ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచుతూ, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే ఈ కార్యక్రమ చేపట్టినట్లు చెప్పారు.

భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలపై నిజాయితీగా నిలబడి నెరవేర్చుకోవాలన్నారు. ప్రజాపాలన అని చెప్పుకోవడం కాదని, ప్రజలకు నచ్చే విధంగా పాలించాలని కాంగ్రెస్‌ పార్టీకి సూచించారు. సూర్యాపేటలో జరిగిన ఈ కార్యక్రమం ప్రజల్లో రాజకీయ అవగాహనను పెంపొందించడంతో బీఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో విజయన్ని అందిస్తుందన్నఆశాభావం వ్యక్తం చేశారు..

జిల్లాల్లో ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డు - Tholi Paluku