Let's talk: editor@tmv.in
జిల్లాలో "యూనిటీ మార్చ్ - మేరా యువ భారత్" కార్యక్రమాలు

జిల్లాలో "యూనిటీ మార్చ్ - మేరా యువ భారత్" కార్యక్రమాలు

Gaddamidi Naveen
19 నవంబర్, 2025

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఘనంగా 'యూనిటీ మార్చ్ మేరా యువ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “యూనిటీ మార్చ్ మేరా యువ భారత్” కార్యక్రమం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఆనంద్‌బాగ్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి సర్దార్ పటేల్ నగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దాకా యూనిటీ మార్చ్ నిర్వహించారు. శతాధిక యువత, విద్యార్థులు, ప్రజలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్దార్ పటేల్ నగర్ చేరుకున్న అనంతరం సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈట‌ల మాట్లాడుతూ భారత మాత గర్వించదగ్గ బిడ్డ అయిన సర్దార్ పటేల్ చేసిన సేవలను 500కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని ఏకీకృతం చేసిన ఆయన దేశ నిర్మాణంలో అపూర్వ పాత్ర పోషించారని ఆయ‌న పేర్కొన్నారు. స్వాతంత్రం మనకు లభించడం అనేకమంది మహనీయుల త్యాగాల ఫలితం అని, వారి సేవలను తరతరాలు స్మరించుకోవడం మన కర్తవ్యమని ఆయ‌న‌ తెలిపారు.దేశభక్తిని పెంపొందించేందుకు, ఐక్యత,భ్రాతృత్వ భావాల్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు యూనిటీ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ జాతీయోత్సవాల భాగంగా మల్కాజిగిరిలో యూనిటీ మార్చ్ విజయవంతంగా నిర్వహించారు.

సిరిసిల్లలో నిర్వహించిన 'సర్దార్@150 యూనిటీ మార్చ్‌'లో పాల్గొన్న కేంద్ర‌మంత్రి బండి

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని,సిరిసిల్లలో నిర్వహించిన యూనిటీ మార్చ్‌ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..దేశంలోని 560 సంస్థానాలను ఒకే జెండా కిందకు తీసుకొచ్చి భారతదేశాన్ని ఏకం చేసిన మహనీయుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు సూచించాడు.అలాగే సనాతన ధర్మం భారత నాగరికతకు మూలస్తంభమని, దీనిపై గర్వంగా మాట్లాడడం తమ కర్తవ్యమని బండి అన్నారు. ఏ క్షణంలోను హిందుత్వం పట్ల తమ వైఖరిని తగ్గించుకోబోమని, ఎవరైనా ప్రశ్నించినా వెనక్కి తగ్గే ఉద్దేశ్యం లేదని ఆయన తెలిపారు.

పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులు హిందువులపై చేసిన దాడులను దేశం ఎప్పటికీ మరచిపోలేదని, ఇటువంటి సంఘటనలు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని మళ్లీ గుర్తు చేస్తాయని ఆయ‌న పేర్కొన్నారు. మన నాగరికత మూలాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవడానికి, పహల్గామ్‌లో ఉగ్రవాదులు హిందువులపై చేసిన దాడులను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అని ఆయన గుర్తు చేశారు.మన సంస్కృతి, ఆధ్యాత్మికత, నాగరికత ప్రపంచానికి మార్గదర్శకమైందని ఆయన అన్నారు. ఈ విలువలను రక్షించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని గుర్తుచేశారు. సనాతన ధర్మం పట్ల ఉన్న గౌరవాన్ని భావోద్వేగాలకు అతీతంగా, భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయ‌న‌ సందేశం ఇచ్చారు.