
జిఓనెం.15 అమలు దేవాదాయ భూములను దోచుకోవడానిచేసిన కుట్ర: కారుమూరి వెంకట రెడ్డి
రాష్ట్రంలోని దేవాలయాలు, దేవాదాయ భూములను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం క్రమబద్ధమైన కుట్రకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మతపరమైన సంస్థల ముసుగులో అధికార పార్టీకి అనుకూల వర్గాలకు అత్యంత విలువైన ఆలయ ఆస్తులను కట్టబెట్టేందుకే ప్రభుత్వం జిఓనెం.15, జిఓనెం.426లను తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు.
గతంలో దేవాదాయ భూములను లీజుకు ఇవ్వాలంటే తప్పనిసరిగా బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉండేదని అయితే తాజా ఉత్తర్వులతో ఆ నియమాలను ప్రభుత్వం పూర్తిగా తొలగించిందని కరుమూరి మండిపడ్డారు. బహిరంగ వేలం అవసరం లేకుండా కేవలం దరఖాస్తు ఆధారంగానే లీజులు కేటాయించే వెసులుబాటు కల్పించారు. ఇది అవినీతికి బ్యాక్‌డోర్ కేటాయింపులకు రాజమార్గం వేయడమే అని అని ఆరోపించారు. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న 4.67 లక్షల ఎకరాల భూముల్లో ప్రధాన పట్టణాల్లో ఉన్న 4,244 ఎకరాల భూమి విలువ ఎకరానికి రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉంటుందని ఈ విలువైన ఆస్తులను కైవసం చేసుకోవడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మౌనం వెనుక మర్మమేంటి?
సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడే ప్రభుత్వం, ఇలాంటి అక్రమ నిర్ణయాలను ఎలా తీసుకుంటుందని కరుమూరి ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులను ఆమోదించిన మంత్రివర్గంలో భాగమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనం పాటించడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒబెరాయ్ గ్రూపునకు గతంలో ఇచ్చిన భూమిని ఆధ్యాత్మిక కారణాలతో రద్దు చేశామని చెప్పి ఇప్పుడు అదే గ్రూపునకు అలిపిరి ప్రాంతంలో 25 ఎకరాలు కట్టబెట్టడం భక్తులను మోసం చేయడమేనని విమర్శించారు.
అంతేకాక కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలం వంటి క్షేత్రాల్లో పవిత్రత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదాల కలుషితం, విద్యుత్ కోతలు, మద్యం బాటిళ్ల వివాదాల వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వైకాపాపై 'హిందూ వ్యతిరేక' ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. .
కాగా గత 18 నెలలుగా దేవాలయ భూముల కేటాయింపులు ఆలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని కరుమూరి సవాల్ విసిరారు. అప్పుడే ఈ 'వ్యవస్థీకృత ఆధ్యాత్మిక విధ్వంసం' వెనుక ఉన్న అసలు నిజాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
