
జాషువా ఆకాంక్ష.. సమ సమాజం
కవి కోకిల జాషువా కోరుకున్న సమ సమాజం ఏర్పాటు కోసం అందరూ కృషి చేద్దామని రాష్ట్రపతి పురస్కార గ్రహీత, ప్రముఖ పండితుడు బేతవోలు రామబ్రహ్మం పిలుపునిచ్చారు. జిల్లా బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అక్కయ్యపాలెం, సాగరమాల కాన్వికేషన్ హాల్లో గుర్రం జాషువా జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామబ్రహ్మం మాట్లాడుతూ, రాజకీయ పార్టీ అయిన బిజెపి, సాహిత్య సదస్సులను నిర్వహిస్తూ ఉండడం శుభపరిణామం అన్నారు. రుక్మిణి కల్యాణాన్ని సమాజ పరిస్థితులకు అనుగుణంగా రాసి తొలి నాటక రచయితగా జాషువా రచన రంగంలో ప్రవేశించి తర్వాత పద్యాలు, కవితలు రాశారన్నారు. స్వానుభవాన్ని కవిత్కరించేవాడు మహాకవి అని తెలిపారు. అందుచేతనే జాషువా మహాకవి అయ్యారన్నారు.
జాషువా రచనను అనుకరిస్తూ రాసే కవులు ప్రస్తుత సమాజంలో కూడా ఉన్నారని తెలిపారు. జాషువా కవిత్వ లక్షణం నిరంతరం సాగుతుందన్నారు. స్త్రీని శృంగార కావ్యంగా వస్తున్నా కవిత్వానికి విరుద్ధంగా, తెలుగు కవిత పద్య లోకాన్ని నూతన మార్గంలో నడిపిన వారు జాషువా అని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం జాషువా పరితపించారని తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వ గురువైతే, తాను విశ్వ నరుడునని జాషువా పలికారని గుర్తు చేశారు. మనిషి మనిషిగా సామాజిక సమానత్వం ఉండాలని జాషువా ఆకాంక్షిం చారన్నారు.
కొత్త తరానికి ఆయనే ప్రేరణ
కవితా రంగంలో కొత్త తరాన్ని ఆయన ప్రేరణ కలిగిస్తున్నారని రామబ్రహ్మం తెలిపారు. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ కవి కోకిల గుర్రం జాషువా 130వ జయంతి ఉత్సవాన్ని ఆంధ్ర రాష్ట్రమంతా జరుపుకుంటున్నారన్నారు. సమాజం దేశం పట్ల జాషువాకు గల ప్రేమ ఆయన రచనలలో కనిపిస్తాయన్నారు. 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించారన్నారు. ఉపాధ్యాయులే కాకుండా, ఆయన తెలుగు పండితులని తెలిపారు. క్రీస్తు చరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అవార్డును జాషువా అందుకున్నారన్నారు. ఏయూ నుండి కళా ప్రపూర్ణ బిరుదును కూడా పొందారున్నారు. సమాజంలోని దళితులపైన వివక్షతను చూసి గబ్బిలం కావ్యం రాశారన్నారు.
చిత్కారాలు పొందిన చోటే ఆయన సత్కారాలు పొందారని కొనియాడారు. చిన్ననాటి నుండే పద్యాలు కవితలు అవధానం చేసుకున్నారన్నారు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ మసీదులలో తలదాచుకొని పురాణ ఇతిహాసాలను జాషువా చదువుకున్నరన్నారు. జాషువాకు ఇద్దరు గురువులు ఉన్నారని, ఒకటి పేదరికం, రెండోది కుల వివక్ష అని తెలిపారు. అధ్యక్షత వహించిన బిజెపి జిల్లా అధ్యక్షులు పరశురామరాజు మాట్లాడుతూ మహాకవి గుర్రం జాషువా వినుకొండలో పుట్టారని, అసమానతలు తొలగాలని సంఘంలో మార్పు కోసం కృషి చేశారన్నారు. పద్యాలు కవితలు రచనల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచారన్నారు. సమానత్వం కోసం జాషువా పరితపించారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బుల్లయ్య కళాశాల తెలుగు విబాగపతి ఎం. సుబ్బారావు, రచయితలు అయ్యగారి సీతారాం, కవి సిహెచ్ చిన్న సూరి, దుర్గాప్రసాద్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దీపక్, నాగేంద్ర, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కింపాడ రాజశేఖర్, కవులు, రచయితలు, సాహిత్య అభిమానులు, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు.
