
జార్ఖండ్ లో ఏనుగు దాడిలో 13 మంది మృతి
గిరిజన గ్రామాల్లో ఓ ప్రమాదకరమైన మదగజం ప్రజలను భయపెడుతోంది. హింసాత్మకంగా ప్రవర్తిస్తూ మనుషుల ప్రాణాలను హరిస్తోంది. ఏ క్షణంలో ఎక్కడి నుంచి వచ్చి తమ ప్రాణాలు తీస్తుందోనని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర చేతులు పెట్టుకుని గడుపుతున్నారు. నియంత్రణ కోల్పోయి ఇప్పటికే 13 మందిని తొక్కి చంపేసింది.
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో ఒక రోగ్ (అతి హింసాత్మక) ఏనుగు రెండు రోజుల వ్యవధిలో వేర్వేరు ఘటనల్లో 13 మందిని చంపడంతో ఈ ప్రాంతమంతా భయాందోళనలో గడుపుతోంది. ఈ ఘటనల్లో మరో నలుగురు గాయపడినట్లు చైబాసా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆదిత్య నారాయణ తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి నోవాముండి, హాట్‌గమారియా పోలీస్ స్టేషన్ పరిధిలోకి చొరబడిన ఏనుగు ఆరుగురిని తొక్కి చంపింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. అంతకుముందు రోజు కోల్హాన్ ప్రాంతంలో ఇదే ఏనుగు ఏడుగురిని, అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి ప్రాణాలను తీసింది.
ఏనుగును అటవీ ప్రాంతానికి తరిమేందుకు పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా నుంచి నిపుణులతో కలిసి అటవీ శాఖ బృందాలు రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ఏనుగుల సంచారం కారణంగా చక్రధర్‌పూర్ డివిజన్ పరిధిలో దక్షిణ తూర్పు రైల్వేకు చెందిన పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత మధు కోడా అటవీ శాఖపై విమర్శలు గుప్పించారు. గతంలో గ్రామ సమితీలకు టార్చ్‌లు, పటాకులు పంపిణీ చేసి ఏనుగులను తరిమే చర్యలు చేపట్టేవారని, ప్రస్తుతం అవి నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. ఏనుగు దాడుల్లో అనాథలైన చిన్నారుల పునరావాసం, వారి విద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
భయాందోళనలు కలిగిస్తోంది
గుంపు నుంచి వేరుపడిన ఒక ఒంటరి అడవి మగ ఏనుగు (లోన్ టస్కర్) కోల్హాన్ డివిజన్‌లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏనుగు మంగళవారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తొక్కి చంపిందని సింగ్‌భూమ్ ప్రాంతీయ ప్రధాన అటవీ సంరక్షణాధికారి (ఆర్సీసీఎఫ్) స్మితా పంకజ్ వెల్లడించారు. కోల్హాన్ డివిజన్‌లో ఒక ఒంటరి మగ ఏనుగు కొద్ది రోజులుగా తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది. గత రాత్రి అది ముగ్గురిని హతమార్చింది. ఇప్పటివరకు ఈ ఏనుగు దాడుల్లో మొత్తం ఏడుగురు మృతి చెందారని ఆమె చెప్పారు.
