
జార్ఖండ్ రాజ్‌భవన్‌ను ‘బిర్సాభవన్’గా మార్చాలి
జార్ఖండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాధాకృష్ణ కిషోర్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో రాంచీలోని రాజ్ భవన్‌ను ‘బిర్సా భవన్’గా పేరు మార్చాలని ప్రతిపాదించారు. రాజ్ భవన్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి కాబట్టి, దాని పేరు మార్చే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన సభలో తెలిపారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ కార్యక్రమాలు పునఃప్రారంభమైన వెంటనే కిషోర్ ఈ ప్రతిపాదనను సభ ముందు ఉంచారు.
రాజ్ భవన్ పేరు మార్చే అధికారం రాష్ట్రానికే ఉంటుంది
గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ పవర్ గవర్నర్ దగ్గరే నిక్షిప్తమై ఉంటాయి. రాష్ట్ర శాసన కార్యకలాపాలు కూడా గవర్నర్ కార్యాలయం నుంచే జరుగుతాయి అని చెప్పారు.
అందువల్ల రాజ్ భవన్ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి కావడంతో దాని పేరును మార్చే అధికారమూ రాష్ట్రానికే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాంచీలోని రాజ్ భవన్‌ను బిర్సా ముండా పేరుతో ‘బిర్సా భవన్’గా, డుమ్కాలోని రాజ్ భవన్‌ను సిదో-కాన్హు ముర్ము పేరుతో ‘సిదో-కాన్హు భవన్’గా మార్చాలని ప్రతిపాదిస్తున్నాను అని సభకు తెలిపారు.
కేంద్రం ఆదేశాలతో
దేశవ్యాప్త వలస పాలనా నాటి పేర్లను తొలగించే కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 3న జార్ఖండ్‌లోని రాజ్ భవన్‌ను అధికారికంగా ‘లోక్ భవన్’గా ఇప్పటికే మార్చారు. హెం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా రాజ్ భవన్‌లను ‘లోక్ భవన్’, రాజ్ నివాస్‌లను ‘లోక్ నివాస్’గా మార్చాలని పంపిన ఆదేశాల అనంతరమే ఈ మార్పులు చేపట్టారు. కేంద్ర ఇచ్చిన సూచనల ప్రకారం ఇప్పటికే దేశంలో సుమారు 10 రాష్ట్రాలు రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా పేర్లు మార్చాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిస్సా, గుజరాత్, త్రిపుర, తెలంగాణ, ఏపీ ఉన్నాయి.
రాజ్ భవన్ చరిత్ర
• రాంచీ నగర మధ్యలో ఉన్న ప్రధాన రాజ్ భవన్ విస్తీర్ణం 52 ఎకరాలు
• ఆడ్రీ హౌస్ 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది
• రాజ్ భవన్ నిర్మాణం 1930లో ప్రారంభమై, 1931 మార్చిలో పూర్తైంది
• అప్పుడు దాని అంచనా వ్యయం రూ.7 లక్షలు
