Let's talk: editor@tmv.in
జార్ఖండ్‌, రాజస్థాన్‌లకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక

జార్ఖండ్‌, రాజస్థాన్‌లకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక

Dantu Vijaya Lakshmi Prasanna
27 డిసెంబర్, 2025

జార్ఖండ్‌లోని 12 జిల్లాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయాయని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు.

ముఖ్యాంశాలు:

గుమ్లా జిల్లాలో అత్యల్పంగా 2.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాంచీ, ఖుంతి, హజారీబాగ్, బొకారో, రామ్‌గఢ్, కోడెర్మా, గుమ్లా, లోహర్దగా, చత్రా, లాతేహర్, పలాము గర్వా జిల్లాలకు శనివారం ఉదయం 8:30 గంటల వరకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు.

దిగువ ట్రోపోస్పియర్ స్థాయిలో వీస్తున్న వాయువ్య, పశ్చిమ గాలుల వల్ల ఈ చలి తీవ్రత పెరిగిందని రాంచీ వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ అభిషేక్ ఆనంద్ పేర్కొన్నారు.

జార్ఖండ్‌లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, గుమ్లా జిల్లా అత్యంత శీతలంగా మారి 2.8°C కనిష్ట ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఆ తర్వాత ఖుంతి మరియు లోహర్దగా జిల్లాల్లో 5.2°C ఉష్ణోగ్రత నమోదవగా, హజారీబాగ్ లో 5.3°C, డాల్టన్‌గంజ్ లో 5.6°C గా నమోదైంది. రాష్ట్ర రాజధాని రాంచీ లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉష్ణోగ్రత 7.0°C కు పడిపోయింది. అలాగే బొకారో లో 6.9°C, సిమ్డేగా లో 7.3°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 48 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

రాజ్యస్థాన్ లోని కరౌలిలో 3.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత

గడిచిన 24 గంటల్లో రాజస్థాన్ వ్యాప్తంగా వాతావరణం పొడిగా, అత్యంత శీతలంగా ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు నగరాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో శుక్రవారం ఉదయం 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే అత్యంత చల్లని ప్రాంతంగా కరౌలి (3.6°C) నిలిచింది. ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదుకాగా, గరిష్టంగా బార్మర్‌లో 28.4°C అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇతర ప్రాంతాల్లో సీకర్ జిల్లాలోని ఫతేపూర్‌లో 4.6°C, దౌసాలో 5°C, పాలి, బరన్ జిల్లాలోని అంతాలో 5.2°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయ్‌పూర్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురిసినట్లు, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు, పొడి వాతావరణం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

జార్ఖండ్‌, రాజస్థాన్‌లకు భారత వాతావరణ శాఖ హెచ్చరిక - Tholi Paluku