Let's talk: editor@tmv.in
జార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్‌లో బ్లాక్‌బాక్స్ లేదు:ఏఏఐబీ

జార్ఖండ్ ఎయిర్ అంబులెన్స్‌లో బ్లాక్‌బాక్స్ లేదు:ఏఏఐబీ

Pinjari Chand
26 ఫిబ్రవరి, 2026

జార్ఖండ్‌లో కూలిపోయిన రెడ్‌బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 (వీటీ-ఏజేవీ) విమానంలో బ్లాక్‌బాక్స్‌లు లేవని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానయాన నిబంధనల ప్రకారం గరిష్ట టేకాఫ్ బరువు 5,700 కిలోల కంటే తక్కువగా ఉన్న విమానాలకు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్ ) తప్పనిసరి కాదు. సంబంధిత విమానం గరిష్ట బరువు ఈ పరిమితికి లోబడి ఉండటంతో బ్లాక్‌బాక్స్ అమర్చలేదని సమాచారం. ఘటనాస్థలిని బుధవారం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెష్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందం పరిశీలించింది. శిథిలాల నుంచి ఆధారాలను సేకరించి, మరింత దర్యాప్తు చేపడుతోంది.

రెడ్‌బర్డ్ ఎయిర్వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ సీ90 (వీటీ-ఏజేవీ) విమానం రాంచీ నుంచి ఢిల్లీకి వైద్య అత్యవసర (మెడికల్ ఎవాక్యువేషన్) విమానంగా ప్రయాణిస్తుండగా, సోమవారం సాయంత్రం జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సిమారియా బ్లాక్‌లోని కసరియా పంచాయతీ పరిధిలో కూలిపోయింది. మంగళవారం డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు.

సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శుభమ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఏఏఐబీ బృందం అవసరమైన పత్రాలు, ఆధారాలను సేకరించింది. మరింత దర్యాప్తు రేపు కూడా కొనసాగుతుంది. స్థానికులు విమానం నియంత్రణ కోల్పోయి 2-3 సెకన్లలో కూలిపోయిందని తెలిపారు. మృతదేహాలను అప్పగించి, పోస్ట్‌మార్టం పూర్తి చేశామని తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, విమానం రాంచీ నుంచి సాయంత్రం 7:11 గంటలకు బయలుదేరి, వారణాసి దక్షిణ–ఆగ్నేయ దిశలో సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్, కమ్యూనికేషన్ సంప్రదింపులు కోల్పోయింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో 7 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి పాఠకులకు విదితమే..