
జార్ఖండ్‌లో 16 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్
నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పాటిరామ్ మాఝీ అలియాస్ అనల్ దా నేలకొరిగాడు. భద్రతా దళాల ఆపరేషన్ లో అతనితో సహ 16 మంది ఉద్యమ నాయకులు అసువులు బాశారు. కేంద్రం మావోయిస్టుల నిర్మూలనకు విధించిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ భద్రతా దళాలు మావోయిస్టుల కోటలను జల్లెడ పడుతున్నాయి. జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో, రూ.కోటి నజరానా ఉన్న టాప్ మావోయిస్టు నేతతో సహా మొత్తం 16 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు గురువారం తెలిపారు. మృతుల్లో మావోయిస్టుల కీలక నేత పాటిరామ్ మాఝీ అలియాస్ అనల్ దా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
సారండా అడవుల్లోని కిరిబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్డీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ప్రత్యేక దళం కోబ్రా యూనిట్‌కు చెందిన సుమారు 1,500 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, గురువారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కూడా ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. పోలీస్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మైఖేల్ రాజ్ ఎస్ మాట్లాడుతూ, సారండా అడవుల్లో అనల్ దా తన బృందంతో ఉన్నాడన్న రహస్య సమాచారం మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు.
గిరిడిహ్ జిల్లా పిర్తాండ్ ప్రాంతానికి చెందిన అనల్ దా, 1987 నుంచే మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉన్నాడని, అతని కోసం పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా గాలింపు కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లోని కొల్హాన్, సారండా ప్రాంతాలను మావోయిస్టుల చివరి కోటలుగా భావిస్తారు. బుడా పహాడ్, చాత్రా, లటేహార్, గుమ్లా, లోహార్దగా, రాంచీ, పరస్నాథ్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఇప్పటికే మావోయిస్టుల కార్యకలాపాలను గణనీయంగా నియంత్రించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బాబూలాల్ మరాండి స్పందిస్తూ, రూ.కోటి నజరానా ఉన్న మావోయిస్టు నేత హతం కావడం ‘రెడ్ టెర్రరిజం’పై పెద్ద విజయం అని వ్యాఖ్యానించారు. మావోయిజాన్ని 2026 మార్చి నాటికి పూర్తిగా నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పం దిశగా ఇది కీలక అడుగు అని ఆయన అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు సందర్భాల్లో 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అధికారిక లెక్కల ప్రకారం, 2001 నుంచి 2025 వరకు జార్ఖండ్‌లో 11,000 మందికి పైగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు. సుమారు 250 మంది హతమయ్యారు. 350 మందికి పైగా లొంగిపోవడం జరిగింది. ఈ సమయంలోనూ భారీగా ఆయుధాలు, తూటాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
పాటిరామ్ మాఝీ అలియాస్ అనల్ దా నేపథ్యం
పాటిరామ్ మాఝీ, అనల్ దా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి, దేశంలో అత్యంత కీలకమైన మావోయిస్టు (నక్సలైట్) నేతల్లో ఒకరు. దశాబ్దాలుగా భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకుంటూ, మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. జార్ఖండ్ రాష్ట్రం గిరిడిహ్ జిల్లా పిర్తాండ్ ప్రాంతానికి చెందిన అనల్ దా, సుమారు 1987లో మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. దాదాపు 35 నుంచి 38 సంవత్సరాల పాటు అతడు నక్సలైట్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉన్నాడు.
ఉద్యమాల్లో పాత్ర
జార్ఖండ్‌లో మావోయిస్టు ఉద్యమంలో అనల్ దా అగ్రస్థాయి నేతగా వ్యవహరించాడు. ముఖ్యంగా కొల్హాన్, సారండా అటవీ ప్రాంతాల్లోని మావోయిస్టు కార్యకలాపాలకు ప్రధాన నాయకత్వం వహించాడు. సాయుధ దళాలకు నాయకత్వం వహిస్తూ, పోలీసు, సీఆర్‌పీఎఫ్ బలగాలపై జరిగిన పలు దాడులు, అంబుష్‌లు, పేలుళ్లకు ప్రణాళికకర్తగా ఉన్నాడని భద్రతా వర్గాలు పేర్కొం టున్నాయి.
నేరాల ఆరోపణలు
అనల్ దాపై అనేక తీవ్రమైన కేసులు నమోదయ్యాయి.
• పోలీసు, సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడులు
• ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం
• ఆయుధాలు, పేలుడు పదార్థాల వినియోగం
• స్థానికంగా మావోయిస్టు నెట్‌వర్క్ విస్తరణ
ఈ కారణాల వల్లే అతడిని భద్రతా బలగాలు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా గుర్తించాయి. అనల్ దా తలపై ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది. జార్ఖండ్‌లో మావోయిస్టులకు చివరి బలమైన కోటలుగా భావించే సారండా అడవుల్లో అనల్ దా కీలక పాత్ర పోషించాడు. దశాబ్దాల పాటు భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకోవడమే కాకుండా, స్థానిక యువతను మావోయిస్టు ఉద్యమంలోకి తీసుకోవడంలో కూడా అతడి పాత్ర ఉందని భద్రతా వర్గాలు వెల్లడించాయి.
అగ్ర నేత ‘అనల్’ హతం: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో అగ్ర మావోయిస్టు నేత అనల్ (పాటీరామ్ మాంఝీ) సహా మొత్తం 16 మంది మావోయిస్టులు హతమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. రూ. 2.35 కోట్ల రివార్డు ఉన్న అనల్‌తో పాటు ఐదుగురు మహిళా మావోయిస్టులు కూడా మృతిచెందిన వారిలో ఉన్నారు. అనల్‌పై ఉన్న బహుమతిలో జార్ఖండ్ ప్రభుత్వం రూ.1 కోటి, ఒడిశా ప్రభుత్వం రూ.1.2 కోట్లు, ఎన్ఐఏ రూ.15 లక్షలు ప్రకటించాయి.
‘ఆపరేషన్ మెగాబురు’లో కీలక విజయం
సీఆర్‌పీఎఫ్ కోబ్రా దళాలు, జార్ఖండ్ పోలీసుల సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ మెగాబురు’లో ఈ విజయం సాధించామని అమిత్ షా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. నక్సలిజం నుంచి ప్రాంతాన్ని విముక్తం చేసే దిశగా ఇది కీలక అడుగని పేర్కొన్నారు. మిగిలిన మావోయిస్టులు హింస, ఉగ్రవాద భావజాలాన్ని వదిలి ప్రధాన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మార్చి 31, 2026 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కిరిబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్డి ప్రాంతంలో సుమారు 1,500 మంది కోబ్రా దళ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో ఒకటిగా అధికారులు తెలిపారు.
సీఆర్‌పీఎఫ్ ఐజీ సాకేత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 11 మృతదేహాలను గుర్తించగా, మిగిలిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
జార్ఖండ్ లో ఒకే ఎదురుకాల్పుల్లో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టుల మృతదేహాలు లభించడం ఇదే తొలిసారని తెలిపారు. మిసిర్ బెస్రా మినహా సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యులంతా జార్ఖండ్ లో హతమయ్యారని సింగ్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 60–65 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా సింగ్‌భూమ్ ప్రాంతానికే పరిమితమయ్యారని చెప్పారు.
ఇతర అగ్ర మావోయిస్టుల వివరాలు
ఈ ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో:
అన్మోల్ అలియాస్ సుశాంత్ (బిహార్–ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు) – 149 కేసుల్లో నిందితుడు, రూ.90 లక్షల రివార్డు
అమిత్ ముండా (రీజినల్ కమిటీ సభ్యుడు) – 96 కేసులు, రూ.62 లక్షల రివార్డు
సబ్-జోనల్ కమిటీ సభ్యులు పింటు లోహార్, లాల్జీత్ అలియాస్ లాలు
ఏరియా కమిటీ సభ్యులు రాజేష్ ముండా, బుల్బుల్ ఆల్డా, బబిత, పూర్ణిమ
అనల్‌పై ఉన్న కేసులు
1987 నుంచే క్రియాశీలకంగా ఉన్న అనల్:
2006లో బొకారోలోని సీఐఎస్‌ఎఫ్ క్యాంపుపై దాడి
2019లో సేరైకేలా–ఖర్సావన్ జిల్లాలో ఐదుగురు భద్రతా సిబ్బంది హత్య
2025లో ఒడిశాలో ఐదు టన్నుల పేలుడు పదార్థాల దోపిడీ ఘటనల్లో కీలక పాత్ర పోషించాడు.
