Let's talk: editor@tmv.in
జార్ఖండ్‌లో మూఢనమ్మకాలకు తల్లి, కూతుళ్ల బలి

జార్ఖండ్‌లో మూఢనమ్మకాలకు తల్లి, కూతుళ్ల బలి

Pinjari Chand
19 ఫిబ్రవరి, 2026

దేశంలో నిత్యం ఎక్కడో ఓచోట మూఢనమ్మకాలకు అమాయకులు అసువులు బాస్తూనే ఉన్నారు. మంత్రాలు చేశారని, చేతబడులు చేస్తున్నారనే నెపంతో చంపుతూనే ఉన్నారు. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలో 32 ఏళ్ల మహిళను ‘మంత్రగత్తె’గా ఆరోపిస్తూ ఆమెను, ఆమె ఒడిలో ఉన్న ఏడాది వయసున్న శిశువును దారుణంగా సజీవదహనం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి కుమార్ దుంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశారు. దాడిలో గాయపడిన భర్త అక్కడి నుంచి తప్పించుకుని బంధువుల ఇంట్లో రాత్రి గడిపి, బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తన ఫిర్యాదులో, అర్ధరాత్రి సమయంలో కొందరు తనను, తన భార్యను పిలుస్తున్న శబ్దం విని బయటకు వెళ్లగా, సుమారు పన్నెండుగురు గ్రామస్తులు చేరుకుని భార్యపై మంత్రతంత్రాలు చేస్తున్నదని ఆరోపించారని పేర్కొన్నాడు. ఆ గందరగోళంలో గుంపు కిరోసిన్ పోసి, ఒడిలో ఉన్న శిశువుతో పాటు ఆమెకు నిప్పంటించిందని తెలిపాడు. ఘటనాస్థలంలోనే తల్లి, బిడ్డ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. జగన్నాథ్‌పూర్ ఎస్‌డీపీవో రాఫెల్ ముర్ము మాట్లాడుతూ భర్త ఫిర్యాదు తర్వాత ఆయనను కుమార్ దుంగి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాం. ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని అరెస్ట్ చేశాం. మూఢనమ్మకాల ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన ఇతర మహిళలను గుర్తించే ప్రయత్నం కొనసాగుతోందని తెలిపారు. గ్రామంలో నివసిస్తున్న భర్త బంధువు ఒకరు దీర్ఘకాలిక అనారోగ్యంతో మంగళవారం మృతి చెందగా, అతని మరణానికి బాధితురాలే కారణమని గ్రామస్తులు నిందించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.