
జార్ఖండ్‌లో పెళ్లి బస్సు బోల్తా ఆరుగురు మృతి
ఒకే కుటుంబానికి చెందిన బంధువులందరూ పెళ్లికని సంతోషంగా బయల్దేరారు. సుమారు 90మందికి పైగా ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. సంఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. గాయపడిన వారినందరినీ దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. 32 మంది పరిస్థితి తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం హేమంత్ సొరెన్ హామీ ఇచ్చారు.
జార్ఖండ్ లోని లతేహర్ జిల్లాలో ఆదివారం పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం మహువాడనర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓర్సా–బంగ్లాదారా లోయ వద్ద జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బల్రాంపూర్ జిల్లా నుంచి లతేహర్ జిల్లా మహువాడనర్ కు పెళ్లికి వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని లతేహర్ ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా, వారిలో నలుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. మహువాడనర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారు, మృతులు బంధువులేనని చెప్పారు.
ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గాయపడిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని లతేహర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ విపిన్ కుమార్ దూబే తెలిపిన వివరాల ప్రకారం, 60 మంది గాయపడినవారు మహువాడనర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో, 20 మందికి పైగా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన 32 మందిని మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బస్సులో సుమారు 90 మంది ప్రయాణికులు ఉన్నారని డ్రైవర్ వికాస్ పాఠక్ చెప్పారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో హ్యాండ్ బ్రేక్, ఇంజిన్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించినా వాహనంపై నియంత్రణ కోల్పోయి బోల్తా పడిందని ఆయన వివరించారు.
