Let's talk: editor@tmv.in
జార్ఖండ్‌లో ఏనుగు దాడి.. ఒకరి మృతి

జార్ఖండ్‌లో ఏనుగు దాడి.. ఒకరి మృతి

Pinjari Chand
3 మార్చి, 2026

జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లాలో సోమవారం అడవి ఏనుగు దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాంచీ నగరానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రకోట గ్రామంలో ఉదయం సుమారు 9.30 గంటలకు జరిగింది. అడవి ఏనుగు ఓ వ్యక్తిని తొక్కి చంపిందిని రాటు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామనారాయణ్ సింగ్ తెలిపారు.

రాంచీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) శ్రీకాంత్ వర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, మృతుడిని సుబోధ్ ఖల్కో (30)గా గుర్తించారు. ఘటన అనంతరం అటవీశాఖ బృందం గ్రామానికి చేరుకుని, మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25,000 అందజేసింది. అధికారిక ప్రక్రియలు పూర్తయ్యాక పూర్తి పరిహారం చెల్లిస్తామని తెలిపారు. గాయపడిన వ్యక్తికి రూ.5,000 సహాయం అందించారు. జార్ఖండ్ ప్రభుత్వం ఏనుగు దాడిలో మరణించిన వారికి రూ.4 లక్షల పరిహారం అందిస్తుంది. గ్రామంలో సంచరిస్తున్న ఏనుగును తిరిగి అడవిలోకి తరలించేందుకు అటవీశాఖ బృందం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆపరేషన్ ప్రారంభించింది. ఇటీవల రాష్ట్రంలో మనిషి–ఏనుగు ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆందోళన వ్యక్తం చేశారు. జంతువుల దాడుల వల్ల ఒక్క మనిషి కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా సమగ్ర వ్యవస్థను రూపొందించాలని అధికారులకు సూచించారు.

గత ఫిబ్రవరి 27న కూడా ఓ అడవి ఏనుగు రాంచీ నగరంలోకి ప్రవేశించి, సుమారు ఐదు గంటలపాటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, అనంతరం అడవిలోకి తిరిగి వెళ్లింది. గత ఏడాది ఏప్రిల్‌లో రాటు ప్రాంతంలోని ఓ పాడుబడ్డ కోల్డ్ స్టోరేజ్‌లోకి రెండు ఏనుగులు చొరబడ్డ ఘటన చోటుచేసుకుంది. గత కొన్ని నెలల్లో రామ్‌గఢ్, బోకారో, హజారీబాగ్, చైబాసా, జంషెద్‌పూర్, లోహర్దగ, గుమ్లా, దుమ్కా తదితర జిల్లాల్లో ఏనుగు దాడుల కారణంగా సుమారు 27 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం పేర్కొంది.

ఎలుగుబంటి దాడిలో మరో యువకుడు

అటవీ ప్రాంతంలో మేకలు మేపేందుకు వెళ్లిన ఓ యువకుడు ఎలుగుబంటి దాడికి బలై ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కొర్బా (ఛత్తీస్‌గఢ్) జిల్లాలో చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం... సలైగోట్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల సంతోష్ కుమార్ గోండ్ ఆదివారం తన మేకలను మేపేందుకు అడవికి వెళ్లాడు. సాయంత్రానికి మేకలు ఇంటికి తిరిగి వచ్చినా, సంతోష్ మాత్రం రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్థులకు సమాచారం ఇచ్చి అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు చర్యల్లో భాగంగా, సోమవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో యువకుడి మృతదేహాన్ని సమీప అటవీ ప్రాంతంలో గుర్తించారు.

మృతదేహం వద్ద కనిపించిన పంజా ముద్రల ఆధారంగా ఎలుగుబంటి దాడి చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కట్‌ఘోరా అటవీ డివిజన్ పరిధిలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. కట్‌ఘోరా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కుమార్ నిశాంత్ మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25,000 అందజేశామని తెలిపారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి అయిన అనంతరం అదనంగా రూ.5.75 లక్షల పరిహారం చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థులు ఒంటరిగా అడవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ హెచ్చరించింది.

జార్ఖండ్‌లో ఏనుగు దాడి.. ఒకరి మృతి - Tholi Paluku