
జార్ఖండ్‌లో ఎయిర్ అంబులెన్స్ కూలి ఏడుగురు మృతి
మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీ వెళుతున్న వారు చత్రా జిల్లాలో సిమారియా సమీపంలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిన ఘటనలో మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న మొత్తం ఏడుగురు మరణించారు. మృతదేహాలను చత్రా సదర్ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీచ్ క్రాఫ్ట్ సీ–90 ఎయిర్ అంబులెన్స్‌ను ఢిల్లీకి చెందిన రెడ్ బర్డ్ ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ విమానం సోమవారం సాయంత్రం రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరి, సిమారియా బరియాతు పంచాయతీ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. విమానం సాయంత్రం 7:11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి ఎగిరింది. సుమారు 7:30 గంటల ప్రాంతంలో అదృశ్యమైందని అధికారులు తెలిపారు. ఎగిరిన 20 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు. రాంచీ విమానాశ్రయ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిపారు. అయితే పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం తెలుస్తాయని చెప్పారు.
ప్రతికూల వాతావరణంలో అనుమతి ఎలా ఇచ్చారు?
జార్ఖండ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ మాట్లాడుతూ ప్రతికూల వాతావరణంలో విమానానికి అనుమతి ఎలా ఇచ్చారు? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ, వాతావరణ పరిస్థితులే కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ ఈ విషాద ఘటన హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. వారికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని దేవుడు ప్రసాదించాలని పేర్కొన్నారు.
మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి
రాంచీలోని దేవకమల్ ఆసుపత్రి సీఈఓ అనంత్ సిన్హా మాట్లాడుతూ, సంజయ్ కుమార్ అనే రోగి కోసం ఈ ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరి 16న 65 శాతం కాలిన గాయాలతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారని, మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఢిల్లీకి తరలించడానికి నిర్ణయించుకున్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం 4:30 గంటలకు రోగి ఢిల్లీకి బయలుదేరినట్లు వివరించారు.
మృతుల వివరాలు: కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సవ్రజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, ధురు కుమార్. చత్రా జిల్లాలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
పొలన్నంతా అమ్మేశా
డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా తండ్రి బజరంగీ ప్రసాద్ మాట్లాడుతూ, తన కుమారుడిని డాక్టర్ చేయడానికి తన పొలన్నంతా అమ్మేశానని చెప్పారు. అతనికి ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఒడిశాలోని కటక్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడని తెలిపారు.
సంజయ్ కుమార్ (41) కుటుంబ సభ్యులు రాష్ట్రంలోని ఆరోగ్య సదుపాయాలు సరిగా లేకపోవడమేనని విమర్శించారు. రాంచీలో సరైన చికిత్స అందించి ఉంటే ఈ విషాదం తప్పించుకునే అవకాశం ఉండేది. నా మరిది సంజయ్‌తో పాటు నా చెల్లి అర్చనా దేవిని కోల్పోయాను అని ఒక బంధువు అన్నారు. సచిన్ కుమార్ మిశ్రా సోదరుడు మాట్లాడుతూ, అతను ఎన్నో సంవత్సరాలుగా నర్సింగ్ సిబ్బందిగా పనిచేశాడని, రెండు నుంచి మూడు సంవత్సరాలుగా అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్నాడని తెలిపారు. చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ జి ప్రకారం, ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు.
డైరేక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటన ప్రకారం, వీటీ-ఏజేవీ నమోదు సంఖ్య కలిగిన ఈ విమానం రాంచీ-ఢిల్లీ మార్గంలో మెడికల్ ఎవాక్యుయేషన్ ఫ్లైట్‌గా ప్రయాణిస్తున్నప్పుడు చత్రా జిల్లా కసారియా పంచాయతీ పరిధిలో కుప్పకూలింది. కోల్‌కతాతో 7:34 గంటలకు సంప్రదింపులు జరిగిన తర్వాత, వారణాసి దక్షిణ-తూర్పున సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్, కమ్యూనికేషన్ సంబంధాలు కోల్పోయినట్లు తెలిపింది. దర్యాప్తు కోసం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెష్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) బృందాన్ని ప్రమాద స్థలానికి పంపించారు. డీజీసీఏ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న రెడ్‌బర్డ్ సంస్థ వద్ద ఆరు విమానాలు ఉన్నాయి.
