Let's talk: editor@tmv.in
జామకాయలు కోసిందని ఆరేళ్ల బాలికపై అమానుషం

జామకాయలు కోసిందని ఆరేళ్ల బాలికపై అమానుషం

Pinjari Chand
7 ఏప్రిల్, 2026

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఆరేళ్ల వలస బాలిక జామకాయలు కోసిందనే కారణంతో ఒక మాజీ సైనికుడు ఆమెను మెట్లకు కట్టి కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆదివారం జరిగిన ఈ ఘటనలో బాలికను ఇంటి మెట్లకు కట్టేసి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం అధికారుల దృష్టికి వచ్చింది. అనంతరం బాలికను రక్షించి వైద్య పరీక్షలకు పంపించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రోహిత్ జస్వాల్‌ అనే మెర్చంట్ నేవీ కెప్టెన్ అక్కడగా వెళ్తూ బాలిక మెట్లకు కట్టివేసి ఉన్నదాన్ని గమనించి వెంటనే జోక్యం చేసుకున్నారు. బాలికను విడుదల చేయాలని మాజీ సైనికుడిని కోరినా, అతడు తొలుత నిరాకరించినట్లు తెలిపారు. తరువాత అక్కడ ఉన్న యువకులు ఈ ఘటనను వీడియోలో రికార్డు చేశారు. ఒక వీడియోలో బాలిక జామకాయలు దొంగిలించిందని శిక్షగా కట్టేశానని ఆ వ్యక్తి సమర్థించుకుంటూ కనిపిస్తున్నాడు. అదే సమయంలో బాలిక ఏడుస్తూ ‘నన్ను కాపాడండి’ అని వీడియో తీస్తున్న వ్యక్తిని వేడుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి.

వీడియో వైరల్ కావడంతో హిమాచల్ ప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కెప్టెన్ రోహిత్ జస్వాల్ బాలికను రక్షించి ఆమెను ఇంటికి చేర్చడంతో పాటు పోలీసులకు, చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇచ్చారు. చైల్డ్ హెల్ప్‌లైన్ బృందం అక్కడికి చేరుకున్న తర్వాత నిందితుడు తన చర్యకు క్షమాపణ కోరినట్లు అధికారులు తెలిపారు. అనంతరం బాలికను ఉనాలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నామని జిల్లా కలెక్టర్ జతిన్‌లాల్‌, పోలీసు సూపరింటెండెంట్ సచిన్‌ హైర్‌‌మత్‌ తెలిపారు. నిందితుడిపై బీఎన్‌ఎస్‌, జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకో వీడియోలో నిందితుడు బాలికను కట్టేసిన విషయాన్ని అంగీకరిస్తూ, తాను ఆ సమయంలో సరిగా ఆలోచించలేదని చెబుతూ మళ్లీ ఇలా చేయనని క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది.