Let's talk: editor@tmv.in
జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు... నిరుద్యోగుల‌కు భరోసా: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు... నిరుద్యోగుల‌కు భరోసా: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Panthagani Anusha
21 మార్చి, 2026

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కేవలం అంకెలతో కూడిన ప్రకటన మాత్రమే కాదని అది లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం పరాభవ నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌ను విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అంధకారంలోకి వెళ్లిన యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం వెలుగులు పంచుతోందని ఆయన కొనియాడారు.

రికార్డు స్థాయిలో ఉద్యోగాల కల్పన

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో 6,28,347 ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగుల పక్షపాతిగా నిలిచిందని మంత్రి వివరించారు. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జరిగిన నియామకాల వివరాలను వెల్లడిస్తూ ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు జాబ్ ఫెయిర్ల ద్వారా 1,46,627, పారిశ్రామిక రంగంలో 95,174, ఫుడ్ ప్రాసెసింగ్‌లో 64,035, ఐటీ & ఎలక్ట్రానిక్స్ విభాగంలో 13,866, పర్యాటక రంగంలో 5,208 ఉద్యోగాలను యువతకు అందించామని పేర్కొన్నారు. అంతేకాకుండా మెగా డీఎస్సీ ద్వారా 30,607 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే వేగవంతం చేశామని గుర్తుచేశారు.

విద్యాశాఖలో భారీ నియామకాలు

ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇందులో భాగంగానే విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,500 అధ్యాపక పోస్టులను అదేవిధంగా 3,000 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు. వీటితో పాటు గ్రూప్-1, గ్రూప్-2 కింద 600 పోస్టులు, 1,000 కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ లో చోటు కల్పించడం నిరుద్యోగులకు గొప్ప వరమని అభివర్ణించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి నియామకం వరకు పక్కాగా తేదీలను ప్రకటించడం వల్ల అభ్యర్థులు స్పష్టమైన ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించుకోవచ్చని సూచించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజం

వైసీపీ ఐదేళ్ల పాలనలో యువత భవిష్యత్తు పూర్తిగా నాశనమైందని మంత్రి మండిపడ్డారు. ఏటా 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా వంచించారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో ఉన్న కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధిని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గ్రాడ్యుయేట్లలో 24 శాతం నిరుద్యోగితతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం ఉపాధి లేక 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం జగన్ పాలనలోని దారుణాలకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న కాదు... నిరుద్యోగుల‌కు భరోసా: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ - Tholi Paluku