



జాబిల్లిని చుట్టేసి.. భూమి వైపు ఆర్టెమిస్-II తిరుగు ప్రయాణం
దాదాపు 54 ఏళ్ల తర్వాత మానవుడు చంద్రుడి చెంతకు చేరిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘ఆర్టెమిస్-II’ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు చంద్రుడిని అత్యంత సమీపం నుంచి చుట్టేసి (లూనార్ ఫ్లైబై) విజయవంతంగా పూర్తి చేసి ప్రస్తుతం భూమి వైపు తిరుగు ప్రయాణమవుతున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి జరిగిన ఈ చారిత్రాత్మక ప్రయాణంలో ఓరియన్ వ్యోమనౌక మానవ సహిత యాత్రల చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ట దూరాన్ని చేరుకుని కొత్త రికార్డు నెలకొల్పింది.
అపోలో-13 రికార్డు కనుమరుగు
ఆర్టెమిస్-2 మిషన్ అంతరిక్ష చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచింది. 1970లో అపోలో-13 నెలకొల్పిన 2,48,655 మైళ్ల రికార్డును అధిగమిస్తూ, ఈ వ్యోమనౌక భూమి నుంచి ఏకంగా 2,52,756 మైళ్ల (సుమారు 4,06,771 కిలోమీటర్లు) దూరానికి చేరింది. అంటే అపోలో-13 కంటే సుమారు 4,101 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
చంద్రుడి వెనుక అద్భుతాలు
చంద్రుడి వెనుక భాగం (ఫార్ సైడ్) గుండా ప్రయాణించిన సమయంలో వ్యోమగాములు అరుదైన దృశ్యాలను వీక్షించారు. చంద్రుడి ఉపరితలానికి కేవలం 4,067 మైళ్ల ఎత్తులో ప్రయాణిస్తూ భారీ బిలాలు (క్రేటర్లు), ప్రాచీన లావా ప్రవాహాలు, ఉపరితల చీలికలను పరిశీలించి ఫోటోలు తీశారు. ఈ సందర్భంగా చంద్రుడి రంగు కేవలం తెలుపు, బూడిద కాకుండా గోధుమ, నీలి రంగుల మిశ్రమంగా కనిపిస్తోందని వ్యోమగామి క్రిస్టినా కోచ్ వెల్లడించారు. అలాగే అపోలో-12, 14 ల్యాండింగ్ ప్రాంతాలను కూడా వారు గుర్తించారు.
సూర్యగ్రహణం.. అంతరిక్షంలో కనువిందు
వ్యోమగాములు చంద్రుడి వెనుక భాగంలో ప్రయాణిస్తున్న సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి రావడంతో వారికి తాత్కాలిక సూర్యగ్రహణం కనిపించింది. ఆ చీకటి సమయంలో సూర్యుడి చుట్టూ ఉండే 'కరోనా' అనే వెలుగు వలయాన్ని వారు నిశితంగా పరిశీలించారు. అదే సమయంలో ఆరు ఉల్కలు వేగంగా వచ్చి చంద్రుడిని ఢీకొట్టడాన్ని కూడా వారు గమనించారు, ఇది శాస్త్రవేత్తలకు ఎంతో కీలకమైన సమాచారం. ఆ సమయంలో భూమితో సంబంధాలు కొద్దిసేపు తెగిపోయినప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ యథాతథంగా పునరుద్ధరించబడింది.
‘ఎర్త్‌రైజ్’.. ‘ఎర్త్‌సెట్’ అద్భుత దృశ్యాలు
చంద్రుడి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వ్యోమగాములు ఒక అద్భుతాన్ని చూశారు. మనకు ఇక్కడ ప్రతిరోజూ సూర్యుడు ఉదయించి, అస్తమించినట్లే.. అక్కడ చంద్రుడి అంచుల్లో నుంచి భూమి పైకి రావడం (ఎర్త్‌రైజ్), మళ్ళీ కిందకు వెళ్ళిపోవడం (ఎర్త్‌సెట్) వంటి అరుదైన దృశ్యాలను వారు కళ్లారా చూశారు. చూడటానికి ఎంతో అందంగా ఉన్న ఈ దృశ్యాలు శాస్త్రవేత్తలకు కూడా ఎంతో కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి.
భావోద్వేగ క్షణాలు
ఈ ప్రయాణంలో భావోద్వేగ ఘట్టాలు కూడా చోటుచేసుకున్నాయి. కమాండర్ రీడ్ వైస్‌మాన్ తన భార్య కారోల్ జ్ఞాపకార్థం చంద్రుడిపై ఉన్న ఒక క్రేటర్‌కు ఆమె పేరు పెట్టాలని కోరుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “మనం చూస్తున్న ఈ అద్భుతాన్ని మాటల్లో చెప్పలేం” అని పైలట్ విక్టర్ గ్లోవర్ వ్యాఖ్యానించడం ఈ యాత్ర గొప్పతనాన్ని తెలియజేస్తోంది.
ట్రంప్ ప్రశంసలు.. ‘ఆధునిక అన్వేషకులు’
ఈ విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ వ్యోమగాములను ‘ఆధునిక కాలపు అన్వేషకులు’గా కొనియాడారు. ఫోన్ ద్వారా మాట్లాడిన ఆయన, “మీరు చరిత్ర సృష్టించారు.. అమెరికా గర్వపడేలా చేశారు. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటుకు ఇది పునాది. అక్కడి నుంచి అంగారక గ్రహం వైపు ప్రయాణిస్తాం” అని పేర్కొన్నారు. నాసా అడ్మినిస్ట్రేటర్ కూడా వ్యోమగాములతో ముచ్చటిస్తూ అభినందనలు తెలిపారు.
పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్
సుమారు 10 రోజుల పాటు సాగుతున్న ఈ మిషన్ తుది దశకు చేరుకుంది. చంద్రుడి గురుత్వాకర్షణను ఉపయోగించుకుని భూమి వైపు వస్తున్న ఓరియన్ క్యాప్సూల్ శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండ్ కానుంది. ఈ మిషన్ విజయవంతం కావడం ద్వారా వచ్చే ఏడాది చేపట్టబోయే ‘ఆర్టెమిస్-3’ చంద్రుడిపై మానవ ల్యాండింగ్‌కు మార్గం సుగమం కానుంది. ప్రస్తుతం వ్యోమనౌక సేకరించిన డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.
