
జానపద కళారూపాలను రక్షిద్దాం: కందుల దుర్గేశ్
తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం ఆధ్యాత్మికత, సంగీతాభిమానులకు స్పూర్తితో నిండిపోయింది. కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరై వేడుకను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ మహోన్నత వేదిక తెలుగు కళాసాంస్కృతిక వైభవానికి చిరునామాగా నిలిచిందని తెలుగు కళా సంస్కృతుల బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
అదేవిధంగా ఏపీకి రాష్ట్ర విభజనలో కోల్పోయిన కళా సంస్థలను తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. అందుకోసం ఇప్పటికే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తో పాటు, సంగీత,నాటక,నృత్య శిక్షణ సంస్థలను కేటాయించాలని ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందని తెలిపారు.
కళా పరంపరను పరిచయం చేయడం అందరి బాధ్యత
అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు, శ్యామశాస్త్రి వంటి మహానుభావులను స్మరించుకుంటూ, వారి సంగీత పరంపరను నేటి తరానికి పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సంప్రదాయాల నుండి ఆధునికత వరకు కళారూపాల అందాన్ని యువతకు చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వివరించారు.
అంతరించిపోతున్న తెలుగు జానపద కళారూపాలైన తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావడానికి కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలిపారు. రాజకీయాలను దాటి ప్రజాసేవలో మనసును మరింత నిమగ్నం చేసే శక్తి కేవలం కళా రంగంలోనే ఉందని స్పష్టం చేశారు.
ప్రాంతీయ ఉత్సవాలకు ప్రోత్సాహం
ఇలాంటి అమూల్యమైన కళోత్సవాలు కేవలం విజయవాడలోనే కాకుండా రాజమండ్రి, శ్రీశైలం, మంగళగిరి, శ్రీకాళహస్తి, మొవ్వ తదితర ప్రాంతాల్లో కొనసాగుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రాంతీయంగా కళాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొని సంగీతానందాన్ని పంచిన కళాకారులకు, హాజరైన ప్రతి సంగీత ప్రేక్షకులకు అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్ర సాంస్కృతిక బలాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో భాగస్వాములవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
