
జాతీయ సబ్ జూనియర్ మహిళల హాకీ ఛాంపియన్ జార్ఖండ్
సొంతగడ్డపై జార్ఖండ్ జట్టు మరోసారి సత్తా చాటింది. రాంచీ వేదికగా జరిగిన 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ మహిళల నేషనల్ ఛాంపియన్‌షిప్-2026లో హాకీ జార్ఖండ్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన డివిజన్ ‘ఏ’ ఫైనల్ పోరులో జార్ఖండ్ 2-1 గోల్స్ తేడాతో హాకీ మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసి, వరుసగా రెండో ఏడాది టైటిల్‌ను నిలబెట్టుకుంది.
ఉత్కంఠ రేపిన తుది పోరు
ప్రేక్షకుల మద్దతు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆట ప్రారంభమైన 5వ నిమిషంలోనే జార్ఖండ్ క్రీడాకారిణి సుగన్ సాంగ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. అయితే సెకండాఫ్‌లో పుంజుకున్న మధ్యప్రదేశ్ తరఫున 37వ నిమిషంలో నమ్మి గీతశ్రీ అద్భుత గోల్ చేయడంతో స్కోరు 1-1తో సమమైంది. మ్యాచ్ ముగుస్తుందనుకున్న తరుణంలో, 56వ నిమిషంలో జార్ఖండ్ క్రీడాకారిణి సేవాని కెర్కెట్టా ఫీల్డ్ గోల్ చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఈ టోర్నీలో జార్ఖండ్ తరఫున సందీప కుమారి అత్యధికంగా 5 గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
జయభేరి మోగించిన జార్ఖండ్
ఈ టోర్నీ ఆరంభం నుండి జార్ఖండ్ అజేయంగా నిలిచింది. పూల్ ‘ఏ’లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలవడమే కాకుండా.. క్వార్టర్ ఫైనల్‌లో పంజాబ్‌పై, సెమీఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌పై 2-0 తేడాతో వరుస విజయాలు సాధించి ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఆదివారం జరిగిన ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.
ఒడిశాకు కాంస్యం
అంతకుముందు జరిగిన మూడో స్థానం (కాంస్య పతకం) కోసం జరిగిన పోరులో హాకీ అసోసియేషన్ ఆఫ్ ఒడిశా 4-2 తేడాతో ఉత్తరప్రదేశ్ హాకీ జట్టును ఓడించింది. ఒడిశా తరఫున ప్రియాంక మింజ్ (8, 18 నిమిషాలు) రెండు గోల్స్‌తో మెరవగా, ప్రియా ప్రిన్సెస్ ఎక్కా (22), అర్చన కుజుర్ (27) ఒక్కో గోల్ చేశారు. ఉత్తరప్రదేశ్ తరఫున కెప్టెన్ అరికా కుమారి (29), మమతా కుమారి (58) గోల్స్ చేసినప్పటికీ.. ఆట ప్రారంభంలోనే ఒడిశా సాధించిన ఆధిక్యం ఆ జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఒడిశా కాంస్య పతకంతో టోర్నీని ముగించింది.
