
జాతీయ విద్యా దినోత్సవం: మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారసత్వం
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జరుపుకునే జాతీయ విద్యా దినోత్సవం కేవలం ఒక సెలవు రోజు కాదు. ఇది జ్ఞానం విలువను, జాతి నిర్మాణంలో విద్య యొక్క శక్తిని గుర్తుచేసే పవిత్రమైన రోజు. స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహోన్నత వ్యక్తి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. విద్యారంగంలో ఆయన చేసిన విశేష కృషికి గౌరవం ఇవ్వడానికి, దేశం యొక్క విద్యా లక్ష్యాల పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఈ రోజు ఒక చక్కని వేదికగా నిలుస్తుంది. ఈ విద్యా దినోత్సవం ఆజాద్ గారి అద్భుతమైన దార్శనికతను, ఆయన వారసత్వాన్ని మన తరాలకు తెలియజేస్తుంది.
మౌలానా ఆజాద్ గారి దార్శనికత:
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక బహుముఖ మేధావి. నిస్సందేహంగా ఆయన విద్య ప్రాముఖ్యతను గుర్తించిన తొలి నాయకులలో ఒకరు. ఆయన దృష్టిలో, విద్య అనేది కేవలం అక్షరాస్యత నేర్పడం మాత్రమే కాదు, అది ఒక దేశం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధికి సాంస్కృతిక పురోగతికి మూలస్తంభం. మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా, దేశ విద్యా విధానాన్ని మౌలిక సదుపాయాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సమాజంలో అణగారిన, పేద వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికీ విద్యను అందించాల్సిన అవసరాన్ని ఆయన బలంగా చెప్పారు. విద్య సమ్మిళితంగా, సమానంగా అత్యున్నత నాణ్యతతో ఉండాలని ఆయన గట్టిగా విశ్వసించారు. ఒక వ్యక్తికి సాధికారత కల్పించి, దేశాభివృద్ధికి దోహదపడే విద్యావ్యవస్థను సృష్టించడానికి ఆయన నిరంతరం కృషి చేశారు.
విద్యా వ్యవస్థలో ఆయన కృషి:
ఆజాద్ గారి కృషి దేశం యొక్క ఉన్నత విద్యా వ్యవస్థకు పటిష్టమైన పునాదులు వేసింది. సాంకేతిక విద్య అభివృద్ధి కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటి), ఉన్నత విద్య ప్రమాణాల నిర్వహణ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) వంటి ముఖ్యమైన సంస్థల ఏర్పాటులో ఆయన చురుకుగా పాల్గొన్నారు. అంతేకాకుండా, ఆయన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ వంటి ముఖ్యమైన సంస్థలను కూడా స్థాపించారు. ఈ సంస్థలన్నీ భారతదేశం వైవిధ్యమైన అవసరాలకు అనుగుణంగా జాతీయ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఆయన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయన నిరంతర కృషి దేశంలో అక్షరాస్యతను ప్రోత్సహించింది. జ్ఞాన సమాజాన్ని సృష్టించడంలో సహాయపడింది.
ఈ దినోత్సవం ప్రాముఖ్యత:
జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా, దేశవ్యాప్తంగా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ వేడుకలు ఆజాద్ గారి వారసత్వానికి నివాళులు అర్పిస్తాయి. ఈ రోజు విద్యారంగంలో సాధించిన పురోగతిని సమీక్షించడానికి, ఇంకా దృష్టి పెట్టవలసిన లోపాలను, మెరుగుపరచవలసిన అంశాలను గుర్తించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. 'అందరికీ విద్య' అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి, మరింత అక్షరాస్యులైన, వివేకవంతమైన సమాజాన్ని నిర్మించడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఇది సరైన సమయం. ఇటీవల, ఈ రోజును కొత్త విద్యా కార్యక్రమాలను ప్రారంభించడానికి, బోధన, అభ్యాసంలో వినూత్న విధానాలను ప్రోత్సహించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
మొత్తంగా, నవంబర్ 11 భారతదేశ భవిష్యత్తును రూపొందించడంలో విద్య పోషించే కీలక పాత్రకు నిలువుటద్దం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఒక అద్భుతమైన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప విద్యా సంస్కర్త. ఆయన స్థాపించిన సంస్థలు, ఆయన ప్రతిపాదించిన విధానాలు నేటికీ మన విద్యా వ్యవస్థకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఈ జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా, జ్ఞానాన్ని, వివేకాన్ని, జ్ఞానోదయాన్ని పెంపొందించడానికి మనం మనందరం మరోసారి కట్టుబడి ఉందాం. విద్య ద్వారా జీవితాలను మార్చగల శక్తిని, దాని సామర్థ్యాన్ని మనం తప్పకుండా గౌరవిద్దాం.
స్వతంత్ర భారతంలో విద్యా వ్యవస్థ పరిణామం: 1947 నుండి నేటి వరకు
1947లో స్వాతంత్ర౦ సిద్ధించిన నాటి నుండి, భారతదేశం తన సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో విద్యా వ్యవస్థకు కేంద్ర స్థానాన్ని ఇచ్చింది. దేశ తొలి విద్యా శాఖా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి దార్శనికతతో ప్రారంభమైన ఈ ప్రయాణం, కేవలం అక్షరాస్యతను అందించడం నుండి డిజిటల్, నైపుణ్య-ఆధారిత విద్య వైపు అద్భుతమైన మార్పును చూసింది. విద్యారంగంలో వచ్చిన ఈ చెప్పుకోదగ్గ పరిణామాలు, దేశం యొక్క మారుతున్న అవసరాలు, ప్రపంచ వేదికపై పోటీపడాలనే ఆకాంక్షకు అద్దం పడుతున్నాయి. స్వాతంత్ర౦ అనంతరం భారత విద్యా వ్యవస్థలో వచ్చిన ముఖ్యమైన మార్పులను, దశలవారీగా పరిశీలిద్దా౦ …
మొదటి దశ:
పునాదుల నిర్మాణం, ఉన్నత విద్య (1947 – 1980) స్వాతంత్ర౦ వచ్చిన వెంటనే, దేశంలో విద్యా పునాదులను బలోపేతం చేయడంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించబడింది.
సంస్థాగత స్థాపన:
మౌలానా ఆజాద్ గారి ఆధ్వర్యంలో, ఉన్నత విద్య సాంకేతిక అభివృద్ధి కోసం బలమైన సంస్థలు స్థాపించబడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి):
1956లో స్థాపించబడి, ఉన్నత విద్య ప్రమాణాలను నియంత్రించడానికి, సమన్వయపరచడానికి కీలకంగా మారింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (ఐఐటి):
సాంకేతిక. ఇంజనీరింగ్ విద్యకు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందించడానికి ఐఐటి లు స్థాపించబడ్డాయి.
సాహిత్య, సంగీత నాటక, లలిత కళా అకాడమీలు:
దేశ సాంస్కృతిక, కళాత్మక విద్యకు అంకితమయ్యాయి.
మొదటి విద్యా విధానాలు:
1964-66 లో వచ్చిన కొఠారీ కమిషన్ భారతదేశ విద్యా చరిత్రలో ఒక మైలురాయి. ఇది 10+2+3 విద్యా నిర్మాణాన్ని (పదేళ్ల పాఠశాల విద్య, రెండేళ్ల ఇంటర్మీడియట్, మూడేళ్ల డిగ్రీ) దేశమంతటా అమలు చేయాలని సిఫార్సు చేసింది. ఈ కమిషన్ సిఫార్సుల ఆధారంగా, 1968లో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం (ఎన్ పి ఇ) రూపొందించబడింది, ఇది 'అందరికీ విద్య' అనే భావనకు సిద్ధాంతపరమైన పునాది వేసింది.
రెండవ దశ:
విద్యా వ్యవస్థ విస్తరణ సంస్కరణలు (1986 – 2000) ఈ దశలో వచ్చిన అతిపెద్ద మార్పు. విద్య యొక్క విస్తరణ, నాణ్యత మెరుగుదల వృత్తి విద్యపై ప్రధానంగా దృష్టి సారించారు.
జాతీయ విద్యా విధానం - 1986:
1986లో వచ్చిన నూతన జాతీయ విద్యా విధానం విద్యను 'సమానత్వం', 'సామాజిక న్యాయం' సాధించే సాధనంగా ప్రకటించింది. దీని కింద, నవోదయ విద్యాలయాలు ఓపెన్ యూనివర్సిటీలు వంటి సంస్థలు స్థాపించబడ్డాయి, తద్వారా గ్రామీణ ప్రతిభావంతులకు, దూర ప్రాంతాల వారికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. వృత్తి విద్య, వయోజన విద్యకు కూడా ప్రాధాన్యత పెరిగింది.
ప్రైవేట్ విద్య పెరుగుదల:
1990ల ఆర్థిక సరళీకరణ తర్వాత, విద్యా రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్, మేనేజ్‌మెంట్ వంటి ఉన్నత విద్యలో ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషించడం ప్రారంభించాయి. ఇది విద్యలో అందుబాటును పెంచినప్పటికీ, సమానత్వం, నాణ్యతపై కొత్త సవాళ్లను సృష్టించింది.
మూడవ దశ:
హక్కు ఆధారిత విద్య (2000 – 2020) 21వ శతాబ్దం ప్రారంభంలో, విద్యను కేవలం విధానపరమైన అంశంగా కాకుండా, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుగా గుర్తించే దిశగా దేశం ఒక పెద్ద అడుగు వేసింది.
సర్వ శిక్షా అభియాన్:
2001లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం, 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయబడింది. పాఠశాలల్లో నమోదు, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయుల శిక్షణలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది.
విద్యా హక్కు చట్టం(ఆర్ టి ఇ యాక్ట్ 2009):
ఇది భారత విద్యా చరిత్రలో అత్యంత ముఖ్యమైన మార్పు. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా (ఆర్టికల్ 21ఏ) ప్రకటించిన తర్వాత, విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని నిర్దేశించింది. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఇది సమానత్వ లక్ష్యాన్ని బలోపేతం చేసింది.
మధ్యాహ్న భోజన పథకం:
పాఠశాలల్లో పిల్లల హాజరును, పౌష్టికాహారాన్ని పెంచడానికి ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయబడింది. ఇది ప్రాథమిక విద్యను మరింత ఆకర్షణీయంగా మార్చింది.
నాల్గవ దశ:
నూతన విద్యా విధానం, డిజిటల్ విప్లవం (2020 – నేటి వరకు) కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ సాంకేతిక మార్పుల నేపథ్యంలో, భారత విద్యా వ్యవస్థ ఒక సమూలమైన సంస్కరణ దిశగా పయనిస్తోంది.
జాతీయ విద్యా విధానం (ఎన్ఇపి 2020):
2020లో ప్రవేశపెట్టబడిన ఈ విద్యా విధానం అత్యంత కీలకమైన మార్పులకు నాంది పలికింది.
నిర్మాణ మార్పు:
10+2 నిర్మాణాన్ని 5+3+3+4 నిర్మాణానికి మార్చడం జరిగింది. ఇది బాల్యదశ సంరక్షణ, విద్య (ఇ సి సి ఇ) కి ప్రాధాన్యత ఇస్తుంది.
సమగ్ర అభ్యాసం:
రోట్ లెర్నింగ్‌కు బదులుగా, సంపూర్ణ, అనుభవపూర్వక, విమర్శనాత్మక ఆలోచన సమస్య-పరిష్కార నైపుణ్యాలపై దృష్టి సారించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
మాతృభాష లో విద్య:
ఐదవ తరగతి వరకు మాతృభాష లేదా స్థానిక భాషలో బోధనను ప్రోత్సహించడం.
నైపుణ్యాభివృద్ధి:
పాఠశాల స్థాయి నుండే వృత్తి విద్యా అంశాలను ప్రధాన స్రవంతిలో చేర్చడం ఈ నైపుణ్యాభివృద్ధి ముఖ్య లక్షణం.
డిజిటల్ విద్య:
కోవిడ్-19 సమయంలో ఆన్‌లైన్ విద్య అనివార్యమైంది. దీని ఫలితంగా దీక్ష, స్వయం, ఈ పాఠశాల వంటి డిజిటల్ వేదికల వినియోగం పెరిగింది. ఎన్ఇపి 2020 డిజిటల్ విద్య, సాంకేతికత వినియోగాన్ని ఒక అంతర్లీన భాగంగా అంగీకరించింది, తద్వారా బోధన పద్ధతులు, అభ్యాస అనుభవం ఆధునీకరించబడ్డాయి.
ప్రస్తుతం 2025 నాటికి, భారత విద్యా వ్యవస్థ ప్రధానంగా జాతీయ విద్యా విధానం 2020 క్రింద అమలు చేయబడుతోంది. ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులను భవిష్యత్తుకు సన్నద్ధం చేయడం. ఇందులో 10+2 నిర్మాణాన్ని రద్దు చేసి, 5+3+3+4 అనే నూతన విద్యా నిర్మాణాన్ని (ఐదు సంవత్సరాల ప్రాథమిక దశతో సహా) ప్రవేశపెట్టారు. ఈ విధానం బట్టీ పద్ధతికి స్వస్తి చెప్పి, విమర్శనాత్మక ఆలోచన, అనుభవపూర్వక అభ్యాసం, సమస్య-పరిష్కార నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ఐదవ తరగతి వరకు మాతృభాష లేదా స్థానిక భాషలో బోధనను ప్రోత్సహిస్తూ, పాఠశాల స్థాయి నుండే వృత్తి విద్యాంశాలు, ప్రధాన అభ్యాసంలో భాగమయ్యాయి. అంతేకాకుండా, డిజిటల్ విద్య సాంకేతికత వినియోగాన్ని సమగ్రంగా ఉపయోగించడం ద్వారా విద్యలో సమానత్వంనాణ్యతను పెంచడం ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటిగా కొనసాగుతోంది.
స్వాతంత్ర౦ వచ్చిన నాటి నుండి, భారత విద్యా వ్యవస్థ అక్షరాస్యత రేటును పెంచడం, ప్రపంచ స్థాయి ఉన్నత విద్యా సంస్థలను నిర్మించడం, విద్యను చట్టబద్ధమైన హక్కుగా మార్చడం వంటి అనేక విజయాలను సాధించింది. ఈ ప్రయాణంలో సవాళ్లు లేకపోలేదు. ముఖ్యంగా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య నాణ్యత వ్యత్యాసం, ఉపాధ్యాయుల కొరత మౌలిక సదుపాయాల సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. అయినప్పటికీ, ఎన్ఇపి 2020 వంటి దార్శనిక విధానాల ద్వారా, భారతదేశం అందరికీ సమాన, నాణ్యమైన భవిష్యత్తుకు సిద్ధమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మహత్తర పరిణామం మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి గొప్ప నాయకులు వేసిన దృఢమైన పునాదికి నిదర్శనం.
