
జాతీయ మహిళా హాకీ టీమ్ శిక్షణకు 31 మంది ఎంపిక
అంతర్జాతీయ హాకీ సీజన్‌లో కీలక సవాళ్లకు సిద్ధమవుతున్న భారత మహిళా జట్టు కోసం హాకీ ఇండియా భారీ కసరత్తును ప్రారంభించింది. ఏప్రిల్ 1 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సీనియర్ మహిళల జాతీయ కోచింగ్ క్యాంప్ కోసం 31 మంది సభ్యులతో కూడిన జాబితాను సోమవారం ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్‌లో ముగిసిన ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో రజత పతకం సాధించి, బెల్జియం-నెదర్లాండ్స్ వేదికగా జరిగే ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన జోరులో ఉన్న టీమిండియా.. ఈ శిబిరం ద్వారా తన వ్యూహాలకు మరింత పదును పెట్టనుంది.
బిజీ షెడ్యూల్.. పక్కా ప్రణాళిక
భారత జట్టు ముందు ఈ ఏడాది వరుసగా భారీ టోర్నీలు ఉన్నాయి. జూన్‌లో ఎఫ్‌ఐహెచ్ నేషన్స్ కప్, ఆగస్టులో ప్రపంచకప్, ఆపై సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ జోర్డ్ మారిన్ మార్గదర్శకత్వంలో ఫిట్‌నెస్ స్థాయిలను పెంచడం, క్లిష్ట సమయాల్లో ఒత్తిడిని అధిగమించడంపై ఈ శిబిరంలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. "ముఖ్యమైన టోర్నీల్లో రాణించేలా శారీరకంగా, మానసిక సిద్ధతను పెంపొందించడమే మా లక్ష్యం" అని కోచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పటిష్టంగా జట్టు
శిక్షణకు ఎంపికైన వారిలో ప్రతిభావంతులైన క్రీడాకారిణులు ఉన్నారు. గోల్‌కీపింగ్ విభాగంలో వెటరన్ సవితతో పాటు, ఇటీవల హాకీ ఇండియా ఉత్తమ గోల్‌కీపర్ అవార్డు అందుకున్న బిచు దేవి ఖరిబమ్, మాధురి కిందో, బన్సారీ సోలంకి ఉన్నారు. డిఫెన్స్‌లో నిక్కీ ప్రధాన్, ఉదిత వంటి అనుభవజ్ఞులు ఉండగా.. మిడ్‌ఫీల్డ్‌లో కెప్టెన్ సలిమా టెటె, సుశీల చాను, నేహాతో పాటు ఉత్తమ వర్ధమాన క్రీడాకారిణి సాక్షి రాణా బాధ్యతలు మోయనున్నారు. ఫార్వర్డ్ విభాగంలో 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్' నవనీత్ కౌర్, దీపిక, లాల్‌రెమ్సియామి వంటి స్టార్లతో దాడి విభాగం పటిష్టంగా ఉంది. గాయం నుంచి కోలుకుంటున్న సంగీత కుమారి కూడా పునరావాసంలో భాగంగా ఈ శిబిరంలో చేరనుంది.
ఎంపికైన క్రీడాకారిణుల వివరాలు
గోల్‌కీపర్లు:
సవిత, మాధురి కిందో, బిచు దేవి ఖరిబమ్, బన్సారీ సోలంకి
డిఫెండర్లు:
నిక్కీ ప్రధాన్, ఇషిక చౌదరి, జ్యోతి సింగ్, లాల్తాంట్లుంగి, జ్యోతి, ఉదిత, శిల్పి దబాస్
మిడ్‌ఫీల్డర్లు:
సుశీల చాను, మనీషా చౌహాన్, వైష్ణవి ఫాల్కే, సాక్షి రాణా, సునేలిత తోప్పో, సలిమా టెటె, నేహా, ఇషిక
ఫార్వర్డ్స్:
దీపిక సోరెంగ్, రుతాజా పిసల్, బల్జీత్ కౌర్, నవనీత్ కౌర్, దీపిక, అన్ను, బ్యూటీ డంగ్డంగ్, హీనా బానో, సోనమ్, లాల్‌రెమ్సియామి, ముంతాజ్ ఖాన్, సంగీత కుమారి (రిహాబ్)
